రెజ్లింగ్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి 24 గంటల్లో రాజీనామా చేయాలని బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. అగ్రశ్రేణి రెజ్లర్ల మీ టూ ఆందోళన ఉద్ధృతం కావడం వల్ల కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. భజరంగ్ పూనియా, రవి దహియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బ్రిజ్ భూషణ్‌కు కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది.
రెజ్లర్ల ఇతర డిమాండ్‌ల పట్ల కూడా కేంద్ర క్రీడల మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తమ పోరాటం బ్రిజ్ భూషణ్ రాజీనామా గురించే కాదన్న రెజ్లర్లు ఆయనను జైలుకు పంపిస్తామన్నారు. ఆయిదారుగురు అమ్మాయిలు బ్రిజ్ భూషణ్‌పై నేడు కేసులు నమోదు చేస్తారని వినేశ్ ఫొగాట్ తెలిపారు. తమ దగ్గర రుజువులు ఉన్నాయని తాము అబద్దాలు చెప్పట్లేదని స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా అన్నారు. మరోవైపు రెజ్లర్లు తమకు ఫిర్యాదు చేయవచ్చని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. డబ్ల్యూఎఫ్ఐలో మీటూ ఆరోపణలపై స్పందించిన ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష భారత రెజ్లింగ్‌లో జరుగుతున్న ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.