రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ అరుదైన ఘనత సాధించాడు. సెమీస్‌లో కజికిస్థాన్కు చెందిన సాకెన్ బిబోస్నివ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత బాక్సర్‌గా నిలిచాడు. శనివారం జరిగే తుదిపోరులో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సకోబిడిన్ జోయిరావ్తో తలపడనున్నాడు. సెమీస్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో భారత్‌కు చెందిన మనీశ్ కౌశిక్ ఓటమిపాలై కాంస్యం సాధించాడు.
2017 ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో 49 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు అమిత్. అదే ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ క్వార్టర్స్ వరకు వెళ్లాడు. ఆ తర్వాత జరిగిన ప్రఖ్యాత స్ట్రాంజా మెమోరియల్, ఆసియా క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సొంతం చేసుకుని తానెంటే నిరూపించాడు. ఈ ఏడాది ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత.. 52 కిలోల విభాగంలోకి మారాడు అమిత్. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నాడు.
ఈ టోర్నీలోని ఒక ఎడిషన్‌లో ఇప్పటివరకు ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించలేదు భారత్. కానీ ప్రస్తుత సీజన్లో సెమీస్‌లోకి అడుగుపెట్టిన బాక్సర్లు అమిత్, మనీశ్ ఆ రికార్డును తిరగరాశారు. వరల్డ్ మీట్లో ఇప్పటివరకు భారత్ నుంచి విజేందర్ సింగ్(2009), వికాశ్ క్రిష్ణన్(2011), శివ థాపా(2015), గౌరవ్ బిదూరి(2017) మాత్రమే పతకాలు సాధించారు.
ఇది చదవండి: బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు రికార్డు