బాక్సింగ్‌లోకి సంజీత్ ప్రయాణమే అనూహ్యం. అతడు ఈ క్రీడలోకి వచ్చే సమయానికే సంజీత్(Boxer Sanjeet) సోదరుడు సంజీవ్ బాక్సర్. కానీ అతడు ఈ ఆటలో రాణించలేక వుషూ క్రీడలను ఎంచుకున్నాడు. దీంతో తమ రెండో తనయడు సంజీత్‌ను ఆటల్లోకి రానీయకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు అతడి తల్లిదండ్రులు. కానీ సంజీత్‌కు మాత్రం చదువు పెద్దగా అబ్బలేదు. పైగా పుస్తకాలు అంటేనే భయపడేవాడు. అందుకే చదువును తప్పించుకునేందుకు క్రీడాకారుడు కావాలని నిర్ణయించుకున్నాడు.
అన్న బాటలో బాక్సర్‌ను అవుతానని తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట వాళ్లు వ్యతిరేకించినా సంజీత్ పట్టుదలతో వారు మనసు మార్చుకున్నారు. అన్న సంజీవే అతడి తొలి కోచ్. ఇలా 2010లో ఆటలోకి వచ్చిన అతడు త్వరగా ఎదిగాడు. రింగ్‌లో చక్కని ఫుట్‌వర్క్, శక్తివంతమైన పంచ్‌లతో విజయాలు సాధిస్తూ వేగంగా ఎదిగాడు.
పంచ్ పవర్
నెమ్మదిగా సంజీత్ పంచ్‌లకు పతకాలు రావడం మొదలైంది. జాతీయ స్థాయిలో జూనియర్ విభాగంలో రాణించిన అతడు.. సీనియర్ విభాగంలోనూ సత్తా చాటాడు. జాతీయ కోచ్ కట్టప్ప శిక్షణలో మరింత రాటుదేలిన సంజీత్.. 2018లో జాతీయ సీనియర్ ఛాంపియన్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియా ఓపెన్లోనూ స్వర్ణం గెలిచి శభాష్ అనిపించాడు. ప్రపంచ కాంస్య పతక విజేత తుర్సొనోవ్ లాంటి బాక్సర్లను ఓడించి సత్తా చాటాడు.
2019లో కజకిస్థాన్‌లో జరిగిన ప్రెసిడెంట్స్ కప్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో క్వార్టర్‌ఫైనల్ వరకు వెళ్లిన సంజీత్.. త్రుటిలో ఓడిపోయాడు. అప్పుడు పరాజయం పాలైంది లెవిట్ చేతిలో కావడం విశేషం. నిజానికి అతడు టోక్యోకు కచ్చితంగా అర్హత సాధించాల్సిన వాడే. అయితే 2019 ప్రపంచ మిలటరీ క్రీడల్లో సంజీత్ భుజానికి గాయమైంది. దీనికి శస్త్ర చికిత్స జరగడం వల్ల ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు లెవిట్‌పై గెలిచి ఆసియా ఛాంపియన్(asian boxing championship) అయిన సంజీత్ మరోసారి సత్తా నిరూపించుకున్నాడు.
"ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం నా కెరీర్‌లోనే అత్యుత్తమ ఘట్టం. ఒలింపిక్స్ పతక విజేతను ఓడించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌కు తప్పకుండా అర్హత సాధిస్తానని అనుకున్నా. అయితే పారిస్‌లో జరగాల్సిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా రద్దు కావడం వల్ల ఆశలు ఆవిరయ్యాయి".
- సంజీత్, ఆసియా బాక్సింగ్ ఛాంపియన్
"ఇప్పుడు సంజీత్ అంటే శక్తివంతమైన పంచ్‌లకు పేరు. 2018లో ప్రెసిడెంట్స్ కప్‌లో లెవిట్ చేతిలో ఓడిన తర్వాత అతడి ఆట ఎంతో మెరుగైంది. రింగ్‌లో వేగం పెరిగింది.. పంచ్‌లు మరింత పదును తేలాయి. అయితే రింగ్‌లో తనకు తాను వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం" అని జాతీయ కోచ్ కట్టప్ప అన్నారు.
ఇదీ చూడండి: Asia Championship: బాక్సర్ సంజీత్‌కు స్వర్ణం