కరోనా నేపథ్యంలో అన్ని రంగాల్లో జీతాల కోతలు తప్పట్లేదు. అలాగే క్రీడాకారులు, కోచ్‌లకు ఇచ్చే జీతాలు, అలవెన్సుల్లోనూ కోతలు పడుతున్నాయి. అయితే ఇలా చేస్తే క్రీడల్లో అవినీతి పెరుగుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తోంది అంతార్జతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ). చాలినంత ఆదాయం రాకుంటే క్రీడాకారులు, కోచ్‌లు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కే ప్రమాదముందని ఐఓసీ అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి, ఇంటర్‌పోల్‌లతో కలిసి ఐఓసీ ప్రచురించిన ఓ అధ్యయనంలో ఈ మేరకు ఆందోళన వ్యక్తమైంది.
"క్రీడల్లో పని చేసే వ్యక్తుల జీతాలపై ప్రభావం బాగానే పడుతోంది. జీతాలు ఆలస్యంగా అందుతున్నాయి. వాటిలో కోత కూడా పడుతోంది. క్రీడా రంగం ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్న ఈ తరుణంలో నేరస్థులు, అవినీతిపరులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి వల్ల ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశమున్న వారిని జీతాల తగ్గింపు నుంచి మినహాయించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆటలు తిరిగి ఆరంభమయ్యాక అవినీతి చోటుచేసుకోవచ్చు"అని ఈ అధ్యయనంలో ఐఓసీ పేర్కొంది.