Australian Open 2022: ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ దూరమైన నేపథ్యంలో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఫేవరేట్‌గా మారిన మెద్వెదెవ్ (రష్యా) టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ రెండో సీడ్ ఆటగాడు 6-1, 6-4, 7-6 (7-3) తేడాతో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్)పై గెలిచాడు. వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్న అతను.. తొలి సెట్లో దూకుడు ప్రదర్శించాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌కు బ్రేక్ చేసి 1-1తో స్కోరు సమం చేసిన మెద్వెదెవ్.. ఆ తర్వాత చెలరేగాడు. ఏస్‌లు, విన్నర్లతో విరుచుకుపడి వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి సెట్ సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థి తప్పిదాలు కూడా అతనికి కలిసొచ్చాయి.
రెండో సెట్‌లో లాక్సోనెన్ ప్రతిఘటించడంతో స్కోరు ఓ దశలో 2-2తో సమమైంది. కానీ అయిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదెవ్ ఆధిక్యాన్ని సాధించాడు. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా చివరి వరకూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి సెట్ గెలిచాడు. ఇక మూడో సెట్లో పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ సాగడంతో స్కోరు 6-6తో సమమైంది. దీంతో టైబ్రేకర్ తప్పలేదు. అందులో పైచేయి సాధించిన మెద్వెదెవ్ విజయం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 10 ఏస్‌లు, 21 విన్నర్లు కొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-2, 6-4, 6-3తో మైకెల్ (స్వీడన్)పై, అయిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6-3, 6-2, 6-2తో గియాన్‌లుకా (ఇటలీ)పై గెలిచారు. ముర్రే (బ్రిటన్) 6-1, 3-6, 6-4, 6-7 (5-7), 6-4తో నికొలోజ్ (జార్జియా)పై పోరాడి గెలిచాడు. మరోవైపు అగర్, సిన్నర్, కిర్గియోస్, ష్వార్జ్‌మన్, దిమిత్రోవ్, సిలిచ్ కూడా రెండో రౌండ్ చేరారు. 22వ సీడ్ ఇస్నర్ (అమెరికా) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.
సబలెంక సత్తా: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నిరీక్షణకు ముగింపు పలకాలనే ధ్యేయంతో టోర్నీలో అడుగుపెట్టిన రెండో సీడ్ సబలెంక.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ దాటింది. ఈ బెలారస్ భామ 5-7, 6-3, 6-2తో సాండర్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. ఆమె మ్యాచ్ ఆరంభించిన తీరు చూస్తే ఓటమి తప్పదనిపించింది. తొలి సెట్లో సబలెంకపై ఆధిపత్యం చలాయించిన సాండర్స్ ఓ దశలో 4-1తో ఆధిక్యం సాధించింది. కానీ ఆ దశలో సబలెంక బలంగా పుంజుకుంది. 5-5తో ప్రత్యర్థిని అందుకుంది. కానీ తర్వాతి గేమ్‌లో సబలెంక సర్వీస్‌ను బ్రేక్ చేసిన సాండర్స్ తొలి సెట్ గెలిచింది. రెండో సెట్లోనూ ఆమె 3-1తో ఆధిక్యం సాధించడంతో సబలెంక పని అయిపోయినట్లే అనిపించింది. కానీ అద్భుతంగా పోరాడిన సబలెంక వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి ఆ సెట్ నెగ్గింది. అదే జోరుతో చివరి సెట్ కూడా ఖాతాలో వేసుకుంది.
మిగతా మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-4తో క్లారా (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా) 6-2, 6-3తో సినియాకోవ (చెక్ రిపబ్లిక్)పై, ఏడో సీడ్ స్వైటక్ (పోలెండ్) 6-3, 6-0తో డార్ట్ (బ్రిటన్)పై గెలిచారు. హలెప్, పవ్లిచెంకోవా, రదుకాను, రిబాకిన కూడా ముందంజ వేశారు. మరోవైపు మాజీ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ) 4-6, 3-6తో కనెపి (ఎస్తోనియా) చేతిలో, క్విటోవా (చెక్ రిపబ్లిక్) 2-6, 2-6తో క్రిస్టియా (రోమేనియా) చేతిలో, యుఎస్ ఓపెన్ రన్నరప్ ఫెర్నాండెజ్ (కెనడా) 4-6, 2-6తో మాడిసన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు.
ఇదీ చదవండి:
French Open 2022: జకోవిచ్‌కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌కూ కష్టమే!