Asian Rowing Championship: ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో చివరిరోజు, ఆదివారం భారత్ స్వర్ణంతో పాటు మూడు రజత పతకాలు కైవసం చేసుకుంది. పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో అరవింద్ సింగ్ పసిడి పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో అరవింద్ 7 నిమిషాల 55.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌లో ఆశిష్, సుఖ్‌జిందర్ సింగ్ రజతం నెగ్గారు. వీరు 7 నిమిషాల 12.56 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచారు.
పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్‌లో బిట్టూ సింగ్, జస్కర్ ఖాన్, మంజీత్ కుమార్ (6 నిమిషాల 33.66 సెకన్లు), పురుషుల కాక్స్‌లెస్ ఫోర్స్‌లో జస్వీర్‌సింగ్, పునీత్ కుమార్, గుర్మీత్ సింగ్, చరణ్‌జీత్ సింగ్ (6 నిమిషాల 51.66 సెకన్లు) రజత పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌ను భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజత పతకాలతో ముగించింది.