ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు ఎవరైనాసరే ‘ఉసేన్ బోల్ట్’ అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు! అయితే- ఆ జమైకా పరుగుల వీరుణ్ని తలపించేలా.. మెరుపు వేగంతో పరుగెత్తి అందర్నీ నివ్వెరపర్చాడు కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ. తాజాగా ఇతడి రికార్డునూ చెరిపేశాడు మరో కంబళ వీరుడు నిశాంత్ శెట్టి.
కర్ణాటకలో జరుగుతోన్న కంబళ పోటీల్లో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ 9.55 సెకన్లలో పరుగెత్తగా.. నిశాంత్ అతడిని అధగమించి కేవలం 9.52 సెకన్లలోనే పూర్తి చేశాడు. ఒకరే అంటే మరో వ్యక్తి బోల్ట్‌ను అధిగమించడం వల్ల ఇదో సంచలనంగా మారింది.
నిశాంత్ తన దున్నలతో కలిసి 143 మీటర్ల దూరాన్ని 13.61 సెకన్లలో పరిగెత్తినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ లెక్కన అతడు వంద మీటర్ల పరుగును కేవలం 9.51 సెకన్లలో పూర్తిచేసినట్లన్నమాట.
బోల్ట్‌ను మించిన వేగం..
ప్రస్తుతం 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు బోల్ట్ పేరిట ఉంది. 2009లో బెర్లిన్‌లో నిర్వహించిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో అతడు 9.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ గణాంకాలను పోల్చి చూస్తే.. వంద మీటర్ల దూరాన్ని పరిగెత్తేందుకు బోల్ట్ కంటే నిశాంత్ 0.06 సెకన్ల తక్కువ సమయం తీసుకున్నాడు. అంటే జమైకా వీరుడి కంటే మన శెట్టి వేగవంతమైన వ్యక్తి! అయితే- బోల్ట్, శెట్టి పరిగెత్తిన పరిస్థితులను ఒకేలా చూడలేం. కంబళలో దున్నల వేగం పోటీదారులకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వారి వేగాన్ని పెంచుతుంది. అయితే సాధారణ రన్నింగ్ ట్రాక్‌తో పోలిస్తే కంబళలో బురద మళ్లలో పరుగు తీయడం ఇబ్బందికరమనడంలో మాత్రం సందేహమేమీ లేదు.
ఏమిటీ కంబళ?
ఇది ప్రధానంగా కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయబద్ధమైన పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరిగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొన్నేళ్ల క్రితం కంబళను నిషేధించారు. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిషేధాన్ని తొలగించారు.