National Games 2022 Gujarat : భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరానికి నేడే తెరలేవనుంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను స్థానిక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ ఈ క్రీడలకు వేదికలు. సైక్లింగ్ విభాగంలో పోటీలకు మాత్రం దిల్లీ ఆతిథ్యమిస్తోంది. మొత్తం 36 క్రీడాంశాల్లో 7 వేలకు పైగా అథ్లెట్లు తలపడుతున్నారు. చివరిసారిగా 2015లో కేరళలో ఈ క్రీడలు జరిగాయి.
- అధికారికంగా ఈ జాతీయ క్రీడలు గురువారం ఆరంభమవుతున్నప్పటికీ.. ఇప్పటికే కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. ఈ నెల 30న చైనాలోని చెంగ్డూలో టేబుల్ టెన్నిస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సారి జాతీయ క్రీడల్లో ముందుగానే ఈ ఆటలో పోటీలు నిర్వహించారు. ఈ నెల 20న మొదలైన టీటీ పోటీలు 24నే ముగిశాయి. కబడ్డీ, లాన్‌బౌల్, నెట్‌బాల్, రగ్బీ సెవెన్స్‌లోనూ పోటీలు మొదలయ్యాయి.
- భారత సంప్రదాయ ఆటలు ఖోఖో, యోగాసన, మల్లఖంబ్ జాతీయ క్రీడల్లో అరంగేట్రం చేస్తున్నాయి.
- అవిభాజ్య భారత్‌లో 1924లో లాహోర్‌లో తొలిసారి జాతీయ క్రీడలు నిర్వహించారు. ఆ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు అథ్లెట్లను ఎంపిక చేయడం కోసం 'ఇండియన్ ఒలింపిక్ క్రీడలు' పేరుతో వీటిని మొదలెట్టారు. రెండేళ్లకోసారి వీటిని నిర్వహించారు. 1940లో జాతీయ క్రీడలుగా పేరు మార్చారు. 1985 నుంచి ఒలింపిక్స్ ఫార్మాట్లో క్రీడలు నిర్వహించడం మొదలెట్టారు. మధ్యలో కొన్ని సందర్భాలను మినహాయిస్తే ప్రతి రెండేళ్లకోసారి ఈ క్రీడలు జరిగాయి. 2002లో ఈ క్రీడలకు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది.
- ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పీవీ సింధు, బజ్‌రంగ్ పునియా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ వేర్వేరు కారణాల వల్ల ఈ క్రీడలకు దూరమయ్యారు. కానీ ఆరంభోత్సవంలో నీరజ్, సింధు పాల్గొననున్నారు. అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా, బాక్సర్ శివథాపా, అథ్లెటిక్స్‌లో ద్యుతి, హిమదాస్, మురళీ శ్రీశంకర్ ఈ క్రీడలకు ఆకర్షణగా నిలవనున్నారు.
ఇదీ చదవండి: 'రొనాల్డో, మెస్సి.. ఇప్పుడు సునీల్'.. ఛెత్రిపై ఫిఫా వెబ్ సిరీస్
జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. అదిరిపోయే గోల్ కొట్టిన స్టార్ ప్లేయర్