Women's Asian Hockey Championship: మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదిరే ఆరంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మన జట్టు 13-0 గోల్స్‌తో థాయ్‌లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆట రెండో నిమిషంలో గోల్ కొట్టిన భారత్.. ఇక అక్కడ నుంచి వరుస గోల్స్‌తో థాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
డ్రాగ్‌ఫ్లికర్ గుర్జీత్ కౌర్ అయిదు గోల్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 2వ నిమిషంలోనే గోల్ కొట్టిన గుర్జీత్ ఆ తర్వాత 14, 25 నిమిషాల్లో గోల్స్ సాధించింది. వందన కటారియా (7వ నిమిషం), లిలీమా మింజ్ (14వ ని, 24వ ని), జ్యోతి (15వ ని) రజ్వీందర్ కౌర్ (16వ ని, 24వ ని) ప్రత్యర్థి గోల్‌పోస్టుపై విరుచుకుపడడం వల్ల రెండో క్వార్టర్ ఆఖరికి భారత్ 9-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. మూడు, నాలుగు క్వార్టర్స్‌లోనూ థాయ్ పుంజుకోలేదు. మరోవైపు ప్రత్యర్థి డిఫెన్స్‌లో లోపాలను సొమ్మ చేసుకుంటూ భారత్ దూకుడు కొనసాగించింది. జ్యోతి (36వ), గుర్జీత్ (43వ, 58వ), మౌనిక (55వ) గోల్స్ కొట్టడం వల్ల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో కొద్దిలో పతకం కోల్పోయిన తర్వాత భారత్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. రెగ్యులర్ కెప్టెన్ రాణీ రాంపాల్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో గోల్‌కీపర్ సవితా పునియా జట్టుకు నాయకత్వం వహిస్తోంది.