భారత హాకీ దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత సీనియర్ బల్బీర్ సింగ్(95) మృతిచెందడంపై పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో బల్బీర్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
భారత హాకీ జట్టుకు బల్బీర్ ప్రాతినిధ్యం వహించే సమయంలో దేశమంతా బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ హాకీ. క్రికెట్ కంటే ముందు దేశప్రజలు ఇష్టపడిన ఆట. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బల్బీర్.. భారత హాకీలో కొత్త ఆశలను చిగురింపజేశారు.
బల్బీర్.. ఇతర అథ్లెట్లపై ఎంతో గౌరవాన్ని చూపించేవారు. కానీ, ఒలింపిక్స్‌లో తన విజయాల గురించి ఎప్పుడూ గర్వంగా చెప్పుకోలేదు. ఆయన కెరీర్లో సాధించిన పలు విజయాలేంటో తెలుసుకుందాం.
ధ్యాన్‌చంద్ నుంచి ప్రేరణ
పంజాబ్‌లోని జలంధర్‌లో 1923 డిసెంబరు 31న జన్మించారు బల్బీర్ సింగ్. ధ్యాన్‌చంద్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా మూడు పతకాలు సాధించిన తర్వాత హాకీలో అడుగుపెట్టాలని బల్బీర్ నిశ్చయించుకున్నారు. బల్బీర్ 13 ఏళ్లు ఉండగా.. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్ పతకం సాధించారు. భారత మాజీ హాకీ ప్లేయర్ హర్బలీ సింగ్.. బల్బీర్లోని ప్రతిభను గమనించి ఆయనకు హకీలో మెళకువలు నేర్పించారు.
ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆడిన తొలి ఒలింపిక్స్‌లో పసిడిని నెగ్గింది భారత హాకీ జట్టు. బల్బీర్కు కూడా ఇది తొలి బంగారు పతకం. 1948 లండన్ ఒలింపిక్స్ హాకీ పోటీల్లో గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన తుదిపోరులో 4-0 పాయింట్లతో విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో భారత్‌కిది వరుసగా నాలుగో పసిడి విజయం.
ఆ తర్వాత జరిగిన 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు బల్బీర్ వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డారు. గ్రేట్ బ్రిటన్‌పై జరిగిన సెమీస్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేయగా.. నెదర్లాండ్స్‌తో జరిగిన తుదిపోరులో ఐదు గోల్స్ చేసి జట్టు విజయానికి సహకరించారు. ఆ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 6-1 పాయింట్లతో ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణ పతకాన్ని అందుకున్నారు బల్బీర్. ఒలింపిక్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన బల్బీర్ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
ఒలింపిక్స్ స్వర్ణంలో హ్యాట్రిక్
మెల్బోర్న్ వేదికగా 1956లో జరిగిన ఒలిపింక్స్‌లో బల్బీర్.. భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆరంభ కార్యక్రమంలో భారతదేశ దళానికి జెండా మోసే వ్యక్తిగా ఎంపికయ్యారు. భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్లో తలపడ్డారు. అందులో 1-0 పాయింట్లతో భారత్ గెలిచింది. వరుసగా మూడోసారి పసిడిని సాధించారు బల్బీర్. ఆ విజయాన్ని అందుకుని స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు రాజకీయ నాయకులు ప్రత్యేక స్వాగతం పలికారు.
హాకీ ప్రపంచ విజేత జట్టు మేనేజర్
1975 హాకీ ప్రపంచకప్‌లో బంగారు పతకం సాధించిన భారత జట్టుకు బల్బీర్ సీనియర్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు ఇదే పసిడి విజయం.
పురస్కారాలు
హాకీ నుంచి రిటైర్మెంట్ పొందిన తర్వాత బల్బీర్‌ను పలు అవార్డులు వరించాయి. 1957లో భారత ప్రభుత్వం నుంచి క్రీడా విభాగంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 2006లో పంజాబ్ ప్రభుత్వం నుంచి 'ఉత్తమ సిక్ హాకీ ఆటగాడు' పురస్కారాన్ని పొందారు. 2015లో ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అవార్డుతో బల్బీర్‌ను సత్కరించారు.
1947-58
బల్బీర్ 1947 నుంచి 1958 వరకు హాకీ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 61 మ్యాచ్‌లు ఆడి 246 గోల్స్ సాధించారు. ప్రస్తుతం బల్బీర్ మన మధ్య లేకపోయినా.. ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.