పన్నెండేళ్ల శ్రీజేష్(PR Sreejesh)... కేరళలోని ఎర్నాకుళం జిల్లా, కిళక్కంబళంలోని తన ఇంటిని వదిలి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం మరేదో కాదు, ఆటలపైన మక్కువ. తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్లో చేరాలన్న పట్టుదలతో అతడూ.. చేర్చాలావద్దా అన్న మీమాంసలో తల్లిదండ్రులు రవీంద్రన్, ఉషా సతమతమవుతున్నారు. వారిది వ్యవసాయ కుటుంబం. చదువులకైతే ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుంది. ఆటలంటే భవిష్యత్తుకు భరోసా లేదు. దానికితోడు పిల్లాడిని 200కి.మీ. దూరంలోని ఆ స్కూల్‌కి పంపడానికీ వారికి మనసు ఒప్పడంలేదు.
శ్రీజేష్‌కి (PR Sreejesh) ఉన్నట్టుండి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. ఆ ఏడాది(1998) జిల్లాస్థాయి పోటీల్లో షాట్‌పుట్‌లో పతకం గెల్చుకున్నాడు. దాంతో అతడికి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశానికి అవకాశం వచ్చింది. ఆటలపైన ఇష్టం ఉన్న పిల్లాడికి అంతకన్నా ఏం కావాలి.. అందుకే ఇంట్లో ఈ చర్చ. ఏం ఆలోచించారో ఏమో చివరకు అంగీకరించారు తల్లిదండ్రులు. కానీ స్కూల్లో చేరాక శ్రీజేష్ మనసులో అలజడి మొదలైంది.. 'నాకు జ్వరం వస్తే, ఎవరు చూసుకుంటారు?' స్కూల్లో చేర్పించి ఇంటికి వెళ్తోన్న తండ్రిని అడిగాడు శ్రీజేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఆయన నోట సమాధానం లేదు. ఆయనకీ పిల్లాణ్ని వదిలి వెళ్లడం కష్టంగానే ఉంది. అంతలో ఆకాశంలో ఎగురుతోన్న విమానంవైపు శ్రీ దృష్టి మళ్లేసరికి.. ఆలస్యం చేయకుండా అక్కణ్నుంచి వచ్చేశారాయన.
అనుకోకుండా హాకీలోకి..
కేరళలో ఆదరణ ఎక్కువగా ఉండే ఆటలంటే ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్. కానీ స్కూల్లోని ఆ క్రీడల జట్లన్నీ అప్పటికే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో సిద్ధమైపోయాయి. ఏడాదిన్నరపాటు అన్ని రకాల ఆటల్నీ ప్రయత్నించాడు శ్రీ.. ఎక్కడా కుదురుకోలేదు. పైగా హాస్టల్ భోజనం నచ్చేది కాదు. ఇంటికి తిరిగి వెళ్లిపోవడమే మేలేమోనన్న ఆలోచనలూ మొదలయ్యాయి.
సరిగ్గా అదే సమయంలో హాకీ(Field Hockey) కోచ్ జయకుమార్ దృష్టిలో పడ్డాడు శ్రీ. ఆ స్కూల్లో అప్పుడే హాకీ జట్టుని తయారుచేస్తున్నారు. 'శ్రీజేష్ పొడుగ్గా ఉండేవాడు. ఎక్కువ దూరం పరిగెత్తడానికి ఇష్టపడేవాడు కాదుగానీ చురుగ్గా కదిలేవాడు. అందుకే గోల్‌కీపర్‌గా సరిపోతాడనిపించింది' అని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటారు జయ. శ్రీని పిలిచి విషయం చెప్పారు. అప్పుడే ‘గోల్‌కీపర్ అంటే వన్‌మేన్ ఆర్మీ, అదే సమయంలో మిగతా ఆటగాళ్లకు ఉన్నంత గుర్తింపు ఉండదు. కానీ జట్టు గెలుపోటముల్ని మార్చగలిగేది అతడే’ అని చెప్పారు. ఎలాగైతేనేం ఓ జట్టులో భాగం అవుతున్నందుకు సంతోషించాడు శ్రీ. ఆడుతున్న కొద్దీ అతడికి ఆసక్తి పెరిగింది.
కిట్ కోసం ఆవును అమ్మేశారు..
2003లో కేరళలో అండర్-14 జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించారు. అప్పటికి జూనియర్ జట్టుకి హరేంద్ర సింగ్ కోచ్‌గా ఉండేవారు. శ్రీజేష్‌ని ఆయనకి పరిచయం చేశారు జయ. అప్పుడే దిల్లీలో జరగబోయే జూనియర్స్ సెలక్షన్స్‌కి పంపమని చెప్పారు హరేంద్ర. ఆ ఏడాది వేసవిలో జరిగిన జూనియర్స్ సెలక్షన్లకి- పొడుగ్గా, సన్నగా, పెద్ద కళ్లతో ఉన్న పదిహేనేళ్ల శ్రీజేష్ చిన్న బ్యాగు పట్టుకుని దిల్లీలోని నేషనల్ స్టేడియంలో అడుగుపెట్టాడు. అతడితోపాటు తండ్రి కూడా వెళ్లాడు. ఇద్దరికీ మలయాళం తప్ప మరో భాష రాదు. ఇబ్బంది పడుతూనే అంత దూరం వెళ్లారు.
పల్చగా ఉన్న ప్యాడ్లు, పాత హెల్మెట్ పెట్టుకుని గోల్‌పోస్ట్ దగ్గర నిల్చున్నాడు శ్రీజేష్. అక్కడికి వచ్చినవారితో పోల్చితే అతడి ప్రొటెక్టివ్ గేర్ చాలా నాసిరకంగా ఉంది. ఇదే అదునుగా భావించి ఆటగాళ్లు స్టిక్‌తో బంతిని మరింత బలంగా కొట్టేవాళ్లు. అయినా వాటిని ధైర్యంగా అడ్డుకునేవాడు శ్రీ. మధ్యమధ్యలో ప్యాడ్‌లు తీసి బంతి తగిలిన చోట చేత్తో రుద్దుకునేవాడు. 'సరైన కిట్ లేకుండా ఇంత దూరం ఎలా వచ్చాడీ అబ్బాయి' సెలెక్టర్లలో ఒకరు హరేంద్రపైన గట్టిగా అరిచారు.
శ్రీని రప్పించింది అతనే మరి. కానీ శ్రీ ప్రతిభను మాత్రం ఎవరూ ప్రశ్నించలేకపోయారు. ఆరోజు సెలెక్ట్ అయ్యాడు. అప్పుడే చెప్పారు సెలెక్టర్లు కిట్ మంచిది కొనుక్కోవాలని. ఒక మోస్తరుది కొనాలన్నా పదివేలు అవుతుంది. ఇంటికి వస్తూనే తమకున్న అయిదు ఆవుల్లో ఒకదాన్ని అమ్మేసి రూ.10వేలతో కొత్త కిట్ కొన్నారు. 'నాన్నకి హాకీ గురించి అప్పుడు పూర్తిగా తెలీదు. అయినా కూడా ప్రోత్సహించేవారు. నేనెప్పుడు ఏది కొనమని అడిగినా కాదనలేదు. అమ్మానాన్నల ఆశల్ని నిలబెట్టడానికైనా నేను బాగా ఆడాలనుకునేవాణ్ని' అంటాడు శ్రీజేష్.
మొదటిసారి అవాశం రాలేదు..
మొదటిసారి 2004లో ఆసియా కప్ జూనియర్స్ జట్టుకి ఎంపికైనా శ్రీజేష్‌కి తుదిజట్టులో చోటు దొరకలేదు. సాధారణ ఆటగాళ్లకైతే అవకాశం త్వరగా వస్తుంది కానీ, గోల్‌కీపర్లకు కష్టమే. తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన నాలుగు దేశాల టోర్నమెంట్‌లో ఆడే అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభను చూపాడు. ఆపైన ఎప్పుడూ అతడు జూనియర్ జట్టుకు దూరం కాలేదు. 'ఆ సమయంలో నాలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉండేది. తర్వాత జూనియర్ ప్రపంచకప్‌కి గోల్‌కీపర్‌గా ఎంపికచేశారు. దాంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది' అని చెబుతాడు శ్రీ. స్వల్ప వ్యవధిలోనే 2006లో జాతీయ జట్టుకీ ఎంపికయ్యాడు.
సీనియర్ల సూచనలతో..
సీనియర్ జట్టులోకి వెళ్లాక గోల్‌కీపర్ ఆడ్రియన్ డిసౌజా కూడా శ్రీకి అన్ని విధాలా సాయపడేవాడు. అతడిని చూసి చాలా నేర్చుకున్నాడు. ఆపైన తనవైన టెక్నిక్‌లూ అలవర్చుకున్నాడు. అదే సమయంలో హరేంద్ర కూడా సహాయ కోచ్‌గా, మేనేజర్‌గా, కోచ్‌గా సీనియర్ జట్టులో భాగమవుతూ వచ్చాడు. దాంతో శ్రీజేష్‌కు ఒక భరోసా ఉండేది. సాధారణంగా కుడి చేతివాటం ఉన్న గోల్‌కీపర్లు కుడివైపు ఎక్కువగా కదులుతారు. కానీ శ్రీజేష్ రెండు వైపులా అంతే సులభంగా కదులుతాడు.
గోల్‌పోస్ట్ దగ్గర నిలబడ్డంత సేపు సర్వీసుని ఎదుర్కోవడానికి నిలబడే టెన్నిస్ ఆటగాడిలా వంగి సిద్ధంగా ఉంటాడు శ్రీజేష్... ఈ లక్షణాల్ని గమనించే అతడికి అవకాశాలిచ్చేవాడు హరేంద్ర. ఆట సాగుతున్న సమయంలో గోల్‌కీపర్ ఆటగాళ్లకు సూచనలూ ఇస్తుండాలి. భారతజట్టు ఆటగాళ్లు హిందీలోనే ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి తనకూ హిందీ రావాల్సిందే. అందుకోసమే అతడి రూమ్మేట్‌గా హిందీ వచ్చిన ఆటగాణ్ని ఉంచేవాడు హరేంద్ర. క్రమంగా హిందీతో పాటు పంజాబీ కూడా నేర్చేసుకున్నాడు శ్రీ.
షూట్ ఔట్... ప్రత్యర్థి ఔట్
శ్రీజేష్ కెరీర్ ప్రారంభిస్తున్నపుడే భారత జట్టు ప్రదర్శన రోజురోజుకీ తీసికట్టుగా తయారైంది. 2008 ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ పరిణామాలు పాతతరం పోయి కొత్తవాళ్లు రావడానికి నాంది అయింది. అప్పుడే నలుగురు సీనియర్ గోల్‌కీపర్లని దాటుకుని వచ్చాడు. అందుకోసం మండుటెండల్లోనూ అదనపు ప్రాక్టీసుకు సిద్ధమయ్యేవాడు. షూట్ ఔట్‌లో శ్రీ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగేవి. 2011 ఆసియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో షూట్ ఔట్ ద్వారా పాకిస్థాన్‌ను 4-2తో ఓడించిన తర్వాత జట్టులో అతడి స్థానం సుస్థిరమైంది.
'పెనాల్టీ స్ట్రోక్స్ ఆపడంవల్లనో, ప్రత్యర్థి పాకిస్థాన్ అవ్వడంవల్లనో కానీ నాకు ఆ మ్యాచ్‌తో గుర్తింపు వచ్చింది' అంటాడు శ్రీ. 2014 ఆసియా క్రీడల్లో షూట్ ఔట్‌లో పాకిస్థాన్‌పైన గెలిచి స్వర్ణం సాధించాం. అది ఆ క్రీడల్లో 16 ఏళ్ల తర్వాత సాధించిన స్వర్ణం. ఆ విజయంతోనే భారత్ 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2015 డిసెంబరులో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో కుడిచేతి బొటనవేలు, భుజం, తొడ గాయంతోనే పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ ఆడాడు శ్రీ.. ఆ మ్యాచ్‌లోనూ షూట్ ఔట్ ద్వారా హాలెండ్‌పైన గెలిచి కాంస్యం గెలిచింది భారత్. 33 ఏళ్ల తర్వాత ఓ పెద్ద టోర్నీలో పతకం వచ్చింది అప్పుడే.
గోల్‌కీపింగ్ గతంలో ఇండియాకు బలహీనతగా ఉండేది. శ్రీజేష్ వచ్చాక అది బలంగా మారింది. శ్రీజేష్ ఎత్తు ఆరడుగులు. తన ఒడ్డూ పొడుగుతో ప్రొటెక్టివ్ గేర్ వేసుకుని చాలావరకూ గోల్‌పోస్ట్‌ని కప్పి ఉంచగలుగుతాడు. 2016లో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు శ్రీ. రియోలో అతడి సారథ్యంలోనే మన జట్టు క్వార్టర్స్‌కు చేరుకుంది. దాదాపు రెండేళ్లపాటు కెప్టెన్‌గా అనేక విజయాలు అందించాడు. గాయం కారణంగా ఆటకు కొద్దికాలం దూరమయ్యాక ప్రస్తుత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో ఆటగాడిగా చేరాడు.
చావో రేవో..
శ్రీజేష్‌తోపాటు కెరీర్ మొదలుపెట్టిన ఆటగాళ్లెవరూ ప్రస్తుత జట్టులో లేరు. తనూ చివరి దశకు వచ్చేశాడు. అయితే ఒలింపిక్ పతకంతోనే తన కెరీర్‌కు పరిపూర్ణత వస్తుందనుకున్నాడు శ్రీ. కరోనా ప్రారంభం నుంచి టోక్యో ఒలింపిక్స్ వరకు 16 నెలలపాటు హాకీ జట్టు కలిసే ఉంది. ఆ సమయంలో కుర్రాళ్లను ప్రోత్సహిస్తూనే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుతూ లక్ష్యాన్ని పదే పదే గుర్తుచేసుకునేవాడు. గోల్‌కీపర్‌గా తన లక్ష్యం 'నో గోల్స్' అని పెట్టుకున్నాడు. తనకిది చివరి అవకాశమైనా కాకపోయినా జట్టుకి మహదవకాశం అనుకున్నాడు.
టోక్యోలో(Tokyo Olympics 2020) 33 ఫీల్డ్ గోల్స్‌లో 23 అడ్డుకున్నాడు. 27 పెనాల్టీ కార్నర్లలో 17 అడ్డుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన పోటీలో అయితే తన 21 ఏళ్ల అనుభవాన్ని ఆ గంటలో చూపించాలనుకుని బరిలో దిగాడు. ఆ సుదీర్ఘ అనుభవమే చివరి ఆరు సెకన్లలో జర్మనీ పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకుంది. హాకీ ఒలింపిక్ పతకం కోసం దేశ ప్రజల 40ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 'టోక్యో పతకంతో నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకేం కావాలి' అని చెప్పే శ్రీజేష్... ఆ పతకాన్ని తండ్రికి అంకితం ఇచ్చాడు. కాస్త విరామం తీసుకుని 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో(Paris Olympics 2024) స్వర్ణం వేటకు సిద్ధమవుతానంటున్నాడు.
నర్స్ అయ్యేవాణ్నేమో!
అర్ధాంగి అనీషా కూడా శ్రీజేష్ చదువుకున్న స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి. లాంగ్‌జంప్ అథ్లెట్. ఆయుర్వేద డాక్టర్‌గా స్థిరపడ్డారు. వీరికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.
- 2006లోనే చెన్నై కేంద్రంగా పనిచేసే 'ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు' హాకీ జట్టులో స్థానం సంపాదించి, ఆ సంస్థ ఉద్యోగిగానూ మారాడు. అప్పట్నుంచీ తమిళనాడు హాకీ జట్టులో సభ్యత్వం తీసుకుని ఆ రాష్ట్ర ఆటగాడిగానే కెరీర్ కొనసాగించాడు. 2015లో కేరళ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం విద్యాశాఖలో చీఫ్ స్పోర్ట్స్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు.
- హాకీ ఆడకపోయుంటే 'అన్నయ్యలా నర్స్ అయ్యేవాణ్నేమో' అంటాడు.
- శ్రీజేష్ పేరుమీద అతడి ఊళ్లోని ఓ రహదారికి 2014లో ‘ఒలింపియన్ శ్రీజేష్ రోడ్’ అని నామకరణం చేశారు.
- 2017లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.
- రిటైరయ్యాక హాకీ అకాడమీ పెట్టాలన్నది శ్రీజేష్ ఆకాంక్ష.
ఇదీ చదవండి : స్పిన్ బౌలింగ్‌లోనూ హెల్మెట్‌తో.. ఈసీబీ రూల్ ఏం చెబుతోంది?