జపాన్ వేదికగా జరుగుతోన్న టోక్యో ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ రెండో మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా (2వ ర్యాంకు)తో తలపడింది భారత్(10వ ర్యాంకు). ఈ మ్యాచ్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది.
ప్రారంభంలో దూకుడుగా ఆడింది భారత మహిళా హాకీ జట్టు. ప్రత్యర్థిని బలంగా ఎదుర్కొంది. మొదటి రౌండ్లో రెండు జట్లకు పెనాల్టీ కార్నర్లు లభించినా వాటిని గోల్‌గా మలచలేకపోయాయి.
రెండో రౌండ్లో ఆస్ట్రేలియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించగా భారత్ ఒత్తిడికి లోనయింది. అయితే, ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో గోల్ కీపర్ సవిత రెండు గోల్స్‌ను ఆపింది.
36వ నిమిషంలో వందన కటారియా చేసిన గోల్‌తో స్కోర్‌ను సమం చేసింది భారత్. 43వ నిమిషంలో మరో గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది ఆస్ట్రేలియా. చివరి క్వార్టర్లో భారత ఆటగాళ్లను కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు గోల్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఆటకు ఇంకా రెండు నిమిషాలు ఉందనగా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోర్‌ను సమం చేసింది భారత్. మ్యాచ్‌ను టైగా ముగించింది.
శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జపాన్‌పై 2-1 తేడాతో గెలిచి శుభారంభం చేసింది భారత్. మూడో మ్యాచ్‌లో చైనా (11వ ర్యాంకు)తో తలపడనుంది.
ఇదీ చూడండి: భారత మహిళా హాకీ జట్టు శుభారంభం