ఇటీవల అర్జెంటీనా వేదికగా జరిగిన హాకీ టోర్నీపై యువ ఆటగాడు షీలానంద్ లక్రా స్పందించాడు. ఒలింపిక్స్ ఛాంపియన్ అర్జెంటీనాపై తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. మెగాటోర్నీకి ముందు భారత హాకీ జట్టు కూర్పు బాగుందని వెల్లడించాడు.
"ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పాటు రెండు మ్యాచ్‌లను గెలిచాం. ఈ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. తదుపరి బ్రిటన్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌పైనే మా దృష్టంతా" అని షీలానంద్ ప్రకటించాడు.
ఇదీ చదవండి: భారత బాక్సర్ల సత్తా- నాలుగు పతకాలు ఖాయం!
భారత సీనియర్ జట్టులో ఆడే అవకాశం మూడేళ్ల క్రితమే వచ్చిందని షీలానంద్ తెలిపాడు. అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఎప్పుడు భావిస్తుండే వాడినని.. గ్రూపులో తన కంటే అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని ఈ యువ ఆటగాడు పేర్కొన్నాడు. నిలకడైనా ఆటతీరుతో జట్టులో ఎల్లప్పుడూ చోటు కలిగి ఉండటమే తన లక్ష్యమని అతడు వెల్లడించాడు.
కరోనా కారణంగా సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉండటం తనకు కలిసొచ్చిందని షీలానంద్ తెలిపాడు. ఆ సమయంలో తరచుగా కోచింగ్ సిబ్బందితో మాట్లాడేవాడిని.. ముఖ్యంగా కోచ్ గ్రహమ్ రీడ్ నుంచి సలహాలు పొందే వాడినని అన్నాడు.
సహచర ఆటగాళ్లు అమిత్ రోహిదాస్, బిరేంద్ర లక్రాపై ప్రశంసలు కురిపించాడు షీలానంద్. వారిద్దరితో మాట్లాడినప్పుడు తాను ఎంతగానో ప్రేరణ పొందుతానని తెలిపాడు. వారి నుంచి ఎల్లప్పుడు సలహాలు తీసుకుంటానని పేర్కొన్నాడు. తాను తక్కువ ధైర్యంతో ఉన్నప్పుడు వారితో చర్చించడానికి ప్రయత్నిస్తానని షీలానంద్ వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఇదీ చదవండి: మ్యాక్సీకి బెంగళూరే సరైన జట్టు: వాన్