14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు హాకీ సీనియర్ ప్లేయర్ ఎస్వీ సునీల్ (SV Sunil). 2014 ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడైన సునీల్ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం సాధించడంలో కీలకపాత్ర పోషించిన డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్, డిఫెండర్ బీరేంద్ర లక్రా.. గురువారం ఆటకు వీడ్కోలు పలికారు. వీరి బాటలోనే నడిచాడు సునీల్. అయితే షార్టర్ ఫార్మాట్లో (ఐదుగురు సభ్యులుండే జట్టు) ఆడతానని ఇతడు స్పష్టం చేశాడు.
"విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. 14 ఏళ్ల పాటు భారత్‌కు ఆడాను. ఇక జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఇదంతా సులువైన నిర్ణయం కాదు. కఠినమైందీ కాదు. ఎందుకంటే టోక్యో గేమ్స్‌కు (Tokyo Olympics) నేను ఎంపిక కాలేదు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు మరో మూడేళ్లు ఉన్నందున ఒక సీనియర్ ప్లేయర్‌గా గెలిచే జట్టు కోసం యువకులకు దారి ఇవ్వాల్సి ఉంది."
-ఎస్వీ సునీల్, హాకీ ప్లేయర్
కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్.. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వెదురు కర్రలతో హాకీ ఆడుతూ పెరిగాడు. 2007లో ఆసియా కప్‌లో అరంగేట్రం చేశాడు. అందులో ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ పసిడి సాధించింది. మొత్తంగా ఇండియా తరఫున ఆడిన 264 మ్యాచుల్లో 72 గోల్స్ చేశాడు సునీల్.
సునీల్ ఘనతలు..
- అర్జున అవార్డు
- 2012, 2016 ఒలింపిక్స్‌లో (SV Sunil Olympics) భారత్ తరఫున ప్రాతినిధ్యం
- 2011 ఆసియన్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం, రజతం సాధించిన జట్టులో సభ్యుడు
- 2014 ఆసియన్ గేమ్స్‌లో (Asian Games) పసిడి, 2018 ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర
- 2017 ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడు
- 2016, 2018 ఎఫ్ఐహెచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో రజతాలు గెలవడంలో ముఖ్య భూమిక
- 2014 కామన్వెల్త్ క్రీడల్లో (Commonwealth Games) రజతం
ఇదీ చూడండి: రూపిందర్ బాటలో మరో హాకీ ప్లేయర్.. ఆటకు వీడ్కోలు