Yuvraj Singh on Multan declaration: 2004లో పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ ఆల్‌రౌండర్.. నాటి టెస్టులో జరిగిన ఆసక్తికర విషయంపై తొలిసారి స్పందించాడు. అప్పుడు జట్టు తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. 3 టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారత్ 2-1 తేడాతో గెలుపొంది తొలిసారి దాయాది గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గింది. ముఖ్యంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 675/5 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (309; 375 బంతుల్లో 39x4, 6x6) త్రిశతకం సాధించి భారత టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో సచిన్ తెందూల్కర్ (194 నాటౌట్; 348 బంతుల్లో 21x4) ద్విశతకానికి చేరువైన వేళ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కూడా తెలిసిందే. అయితే, ఈ విషయం అప్పట్లోనే సంచలనంగా మారింది. తెందూల్కర్ డబుల్ సెంచరీ సాధించకుండా ద్రవిడ్ అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ పండితులే ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై యువరాజ్ తాజాగా నోరు విప్పాడు. అప్పుడు సచిన్‌ను ద్విశతకం చేయనివ్వాల్సిందని అన్నాడు.
" ఆరోజు నేనూ, సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నామని, వేగంగా పరుగులు చేయాలని జట్టు నుంచి సందేశం వచ్చింది. అప్పుడు సచిన్ ఇంకో ఓవర్ ఆడి ఉంటే ఆ 6 పరుగులూ పూర్తి చేసి ద్విశతకం సాధించేవాడు. మేం ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక 8-10 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాం. కానీ, సచిన్ 194 పరుగుల వద్ద ఉండగా ఇంకో రెండు ఓవర్లు ఆడి ఉంటే అది మ్యాచ్‌పై పెద్ద ప్రభావం చూపేది కాదని నేననుకుంటా. అయితే, ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను మాత్రం సచిన్ 200 కొట్టాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసుంటే బాగుండేదని అనుకున్నాను"
- యువరాజ్ సింగ్
ఆ మ్యాచ్‌లో తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిసారి పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గి తమ సత్తా చాటింది టీమిండియా.
ఇదీ చూడండి: 17 సిక్స్‌లు, 8 ఫోర్లతో 'స్టోక్స్' వీరబాదుడు.. ఒక్క ఓవర్లోనే 34 పరుగులు
'హిట్ మ్యాన్'కు తోడుగా మరో క్రికెటర్.. ఐపీఎల్లో 14 సార్లు డకౌట్