Yuvraj Singh Daughter : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. ఆయన భార్య హేజిల్ కీచ్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువీ స్వయంగా వెల్లడించాడు. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. "నిద్రలేని రాత్రులు సంతోషకరంగా మారాయి. మా యువరాణి 'ఆరా'ను ఆహ్వానిస్తున్నాం. దీంతో మా కుటుంబం పరిపూర్ణం అయ్యింది" అని యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా యువీకి.. సోషల్ మీడియాలో క్రీడా ప్రముఖులు, ఆతడి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2016 నవంబర్ 30న యువరాజ్ సింగ్, హేజిల్ కీచ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పంజాబ్ ఫతేఘఢ్ సాహిబ్ గుర్ద్వారాలో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. కాగా గతేడాది జనవరిలో ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. తాజాగా రెండో సంతానంలో పండంటి పాప పుట్టింది. దీంతో యువరాజ్ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
యువరాజ్ క్రికెట్ కెరీర్..
Yuvraj Singh International Career : 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు యువరాజ్. కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమ్ఇండియాకు 398 మ్యాచ్‌ల్లో యువీ ప్రాతినిధ్యం వహించాడు. వీటన్నింటిలో కలిపి యువీ 11 వేల పరుగులు చేశాడు. కాగా 2019లో యువరాజ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
2011 ప్రపంచకప్‌లో కీలక పాత్ర..
Yuvraj Singh 2011 World Cup Stats : భారత్ రెండోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన 2011 టోర్నీలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఒకే ప్రపంచకప్ టోర్నమెంట్లో బ్యాటింగ్‌లో 300 పై చిలుకు పరుగులు చేసి, బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో యువీ నాలుగు సార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
Hazel Keech Movies : యువీ భార్య హేజిల్.. బాలీవుడ్లో బాడీగార్డ్ సినిమాలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తర్వాత 2013లో హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షో లో పాల్గొంది.