టీమ్‌ఇండియాకు(TeamIndia) ఎంపికైన కొత్త ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvaneswar Kumar) అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఆడిన అనుభవమే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. ఆయా ఫ్రాంచైజీల తరఫున వారంతా అదరగొట్టిన వారేనని ప్రశంసించాడు.
"మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. వారంతా యువకులే, కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు ఆడుతున్నారు. ఆయా జట్ల తరఫున రాణించారు. ఈ అనుభవం టీమ్‌ఇండియాకు ఉపయోగపడుతుంది. ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఐపీఎల్ అనుభవాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మా జట్టు అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో సమతూకంగా ఉంది" అని భువనేశ్వర్ అన్నాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడటం తనకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని భువీ తెలిపాడు. "నేను కోలుకున్న సమయంలో దేశవాళీ క్రికెట్ బాగానే సాగుతోంది. ఫిట్‌నెస్ సాధించడం, పునరాగమనం చేయడం పైనే అప్పుడు నా దృష్టి ఉంది. ఇంగ్లాండ్ సిరీసుకు ముందు దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. ఆటగాళ్లు దేనినీ తేలిగ్గా తీసుకోవద్దు. దృఢంగా, ప్రేరణతో ఉండేందుకు దేశవాళీ క్రికెట్ ఉపయోగపడింది" అని భువీ వెల్లడించాడు.
ప్రస్తుతం భారత జట్టు రెండుగా విడిపోయి ఒకేసారి రెండు దేశాల్లో పర్యటిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్, రహానె, బుమ్రాతో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. లంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసుల కోసం శిఖర్ ధావన్, భువనేశ్వర్, హార్దిక్ పాండ్య, పృథ్వీషాతో కూడిన జట్టు వెళ్లింది. ఆరుగురు క్రికెటర్లు దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి ఈ పర్యటనలో అరంగేట్రం చేయనున్నారు.
ఇదీ చూడండి: ''మ్యాన్ ఆఫ్ ది సిరీస్' భువీకి రాకపోవడం ఆశ్చర్యం'