ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final)కు ముందు టీమ్‌ఇండియాకు తగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం ఆ పేసర్లకు బాధ కలిగించిందని న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. ఈ తుదిపోరుకు ముందు కివీస్.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడగా వారికి తగినంత ప్రాక్టీస్ లభించింది. మరోవైపు టీమ్‌ఇండియాకు సరైన ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం వల్ల రెండు బృందాలుగా విడిపోయి సాధన చేసింది. దీంతో నిర్ణయాత్మక మ్యాచ్‌లో కివీస్ పేసర్లు చెలరేగినట్లుగా భారత బౌలర్లు రాణించలేకపోయారని తెలిపాడు.
"కొన్నిసార్లు మీరు అతిగా ఊహించుకొని.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాకు సరైన సన్నద్ధత లభించిందా? అని అడగొచ్చు. అయితే, కోహ్లీసేనకు తగినంత సమయం దొరికిందని నేను కచ్చితంగా చెప్పగలను. గత 10-12 రోజుల్లో భారత పేసర్లు వీలైనంత ఎక్కువసేపు బౌలింగ్ చేసి తుది సమరానికి సిద్ధమై ఉండొచ్చు. కానీ, మ్యాచ్ ప్రాక్టీస్‌తో సమానంగా వారి సన్నద్ధతని పోల్చడం చాలా కష్టం. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌ల్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించొచ్చు. కానీ అది ఏ మాత్రం పనికిరాదు. దాన్ని మ్యాచ్ ప్రాక్టీస్‌తో పోల్చిచూడటం నిజంగా కష్టమే."
-సైమన్ డౌల్, కివీస్ మాజీ క్రికెటర్.
తుదిపోరుకు ముందు ఇంగ్లాండ్‌తో తలపడటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చిందని మాజీ పేసర్ పేర్కొన్నాడు. కివీస్ కూడా భారత్‌లాగే ఇంగ్లిష్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడేముందు పది రోజులు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లు ఆడి బాగా సన్నద్ధమైందని తెలిపాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో ఆడేసరికి న్యూజిలాండ్ క్రికెటర్లు అన్ని విధాలా మెరుగయ్యారని అభిప్రాయపడ్డాడు. ఇక ఫైనల్లో టీమ్‌ఇండియా పేసర్లపై స్పందించిన డౌల్.. ఇషాంత్ మినహా మిగతావారిలో నిఖార్సైన స్వింగ్ బౌలర్ లేరన్నాడు. బుమ్రా స్వింగ్ చేయగలడని, ఇషాంత్ మరింత ఎక్కువ స్వింగ్ రాబడతాడని సైమన్‌డౌల్ వివరించాడు. మరోవైపు షమి ఎప్పుడూ స్వింగ్ బౌలర్ కాదని పేర్కొన్నాడు. అతడు సీమర్ అని చెప్పాడు. షమి, బుమ్రా చాలా అరుదుగా స్వింగ్ చేస్తారని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. కివీస్ పేసర్లు జేమీసన్ 5/31, వాగ్నర్ 2/40, బౌల్ట్ 2/47 చెలరేగారు. దీంతో భారత బ్యాట్స్‌మెన్ సరిగా ఆడలేకపోయారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కివీస్.. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 34 ఓవర్లకు అశ్విన్ బౌలింగ్‌లో తొలి వికెట్ దొరికిందంటే టీమ్‌ఇండియా పేసర్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి 49వ ఓవర్‌లో ఇషాంత్ రెండో వికెట్ తీశాడు. దీంతో న్యూజిలాండ్ మూడో రోజు ఆట నిలిచేసరికి 101/2 స్కోరుతో నిలిచింది. స్వింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారత పేసర్లు ప్రభావం చూపకపోవడం అభిమానులను నిరాశపర్చింది.
ఇదీ చదవండి: 'ఫైనల్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లో పెట్టొద్దు బాబోయ్'