World Cup 2023 Semi Finals : వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ నేడు (నవంబర్ 15) తమ ఎనిమిదో సెమీస్ ఆడనుంది. ఇప్పటికే ఏడు సార్లు సెమీస్ మ్యాచ్‌లు ఆడిన మన జట్టు.. మూడు సార్లు గెలిచి, నాలుగు సార్లు ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో గత ఏడు సార్లు సెమీస్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం..
వన్డే ప్రపంచకప్‌లో జరిగిన టోర్నీల్లో భారత్ ఇప్పటివరకూ మూడు సార్లు సెమీస్ గండం నుంచి బయటపడి రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1983 ప్రపంచకప్ సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో కపిల్ డెవిల్స్ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్స్‌లో అరివీర భయంకరమైన వెస్టిండీస్ జట్టును చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2003లో గంగూలీ సారథ్యంలో భారత్ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టగా.. ఆ మ్యాచ్‌లో కెన్యాను 91 పరుగుల తేడాతో ఓడించింది. కానీ తుదిపోరులో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసింది. ఇక 2011లో ధోని సేన సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొంది. అదే ఊపులో ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించి కప్పు గెలిచింది.
ఆ నాలుగు సార్లు మాత్రం..
1987, 1996, 2015, 2019 సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. 1983లో తొలిసారి కప్పును అందుకుని జోరు మీదున్న కపిల్ సేన ఆ తర్వాత 1987లో జరిగిన ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓడింది. ఇక 1996 సెమీస్‌లో శ్రీలంక చేతిలో భారత్ పరభవాన్ని ఎదుర్కొంది.
252 పరుగుల ఛేదనలో 34.1 ఓవర్లలో 120/8ను స్కోర్ చేసి భారత్ ఓటమి ఖాయమైన సమయంలో ఈడెన్ గార్డెన్స్‌లోని స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు సీట్లకు నిప్పు పెట్టారు. అంతే కాకుండా మైదానంలో నీళ్ల సీసాలు, ఇతర వస్తువులను విసిరారు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేసిన రిఫరీ శ్రీలంక జట్టును విజేతగా ప్రకటించాడు.
మరోవైపు గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ సెమీస్‌లోనే టీమ్‌ఇండియా ఓటమితో నిష్క్రమించింది. 2015లో ధోని కెప్టెన్సీలో సెమీస్‌లో 95 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. 329 పరుగుల ఛేదనలో 233కే భారత్ కుప్పకూలింది. 2019లో కోహ్లి సారథ్యంలో జట్టు న్యూజిలాండ్‌పై 240 పరుగుల ఛేదనలో విజయానికి చేరువై ఆగిపోయింది. 18 పరుగుల తేడాతో కొహ్లి సేన ఓటమి పాలైంది. 2015, 2019లోనూ ఛేదనలో అర్థశతకాలతో పోరాడిన ధోని రెండుసార్లు రనౌట్‌గా వెనుదిరిగాడు.