బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాను కట్టడి చేయడంలో కుల్‌దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం కుల్‌దీప్ యాదవ్ మాట్లాడుతూ మళ్లీ టెస్టుల్లోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించానని, అలాగే రిథమ్‌పైనా దృష్టిపెట్టినట్లు తెలిపాడు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ కీలకమైన 40 పరుగులు చేశాడు.
"నా ప్రదర్శనతో ఎంతో సంతోషంగా ఉన్నా. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు రాణించడం బాగుంది. రెండో ఇన్నింగ్స్‌తో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త వేగంగా అనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసేందుకు కష్టతరంగా మారింది. అయితే నా రిథమ్‌పై దృష్టిపెట్టి దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించా" అని కుల్‌దీప్ వెల్లడించాడు. కెరీర్‌లో మూడోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కుల్‌దీప్.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకొన్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. చివరి టెస్టు గురువారం (డిసెంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది.