Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుతుందా..? లేదా..?.. ఇప్పుడు ఇదే అంశం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఇప్పటికే లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకోగా.. ఆస్ట్రేలియా (14), దక్షిణాఫ్రికా (9) పాయింట్లతో సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం వెస్టిండీస్ (7), ఇంగ్లాండ్ (6), టీమ్‌ఇండియా (6) పోటీపడుతున్నాయి. అయితే, విండీస్ లీగ్ స్టేజ్‌లో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా ఇంగ్లాండ్, భారత్ జట్లు తమ చివరి మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిథాలీరాజ్ టీమ్ సెమీస్ చేరాలంటే ముందున్న అవకాశాలేంటో ఓసారి పరిశీలిద్దాం.
IND Vs SA: దక్షిణాఫ్రికాపై గెలిస్తే: టీమ్‌ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆడే చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మొత్తం 8 పాయింట్లు సాధిస్తుంది. దీంతో ఇతర సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీస్ చేరుతుంది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రద్దయితే: ఒకవేళ దక్షిణాఫ్రికాతో జరగాల్సిన చివరి మ్యాచ్.. వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు అయినా భారత్‌కే కలిసొచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే రెండు జట్లకూ చెరో పాయింట్ వస్తాయి. అప్పుడు భారత్ మొత్తం 7 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు కూడా వెస్టిండీస్‌తో సమానంగా అన్నే పాయింట్లతో కొనసాగినా టీమ్‌ఇండియా నెట్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో మిథాలీ టీమ్ సెమీస్ చేరే అవకాశముంది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడితే: దురదృష్టం కొద్దీ టీమ్‌ఇండియా ఈ దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఓటమిపాలైతే అప్పుడు పరిస్థితులు కష్టంగా మారుతాయి. అదే రోజు జరగబోయే బంగ్లాదేశ్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో భారీ తేడాతో బంగ్లాదేశ్ గెలవాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇంగ్లాండ్ రన్‌రేట్ పడిపోయి.. భారత్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నేరుగా దక్షిణాఫ్రికాపై విజయం సాధిస్తే టీమ్‌ఇండియా ఎలాంటి ఒత్తిడి లేకుండా నేరుగా సెమీస్ చేరుతుంది. మరి ఆదివారం లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌లో తలపడే మిథాలీ రాజ్ సేన ఏం చేయనుందో చూడాలి.
ఇదీ చదవండి:ఐపీఎల్లో కోట్లకు పడగలెత్తిన ప్లేయర్లు.. కోహ్లీది మూడో స్థానమే