IND VS ENG Dravid: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో గెలుస్తుందనుకున్న టీమ్‌ఇండియా ఓడిపోయింది. మూడు రోజులవరకు ఆధిపత్యం చెలాయించిన మనోళ్లు నాలుగో రోజు మ్యాచ్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ దూకుడుతో విజయం వారి సొంతమైంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ టీమ్‌ఇండియా ఓటమిపై స్పందించాడు. "మేం తొలి మూడు రోజులు బాగానే ఆడినా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఆడలేకపోయాం. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమయ్యామని అనుకుంటున్నా. మ్యాచ్ గెలవాలన్న కసిని కొనసాగించలేకపోయాం. మరోవైపు ఇంగ్లాండ్ గొప్పగా పోరాడి విజయం సాధించింది. ఆ జట్టును మెచ్చుకోవాలి. రూట్, బెయిర్‌స్టో అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించారు. మధ్యలో రెండు, మూడు అవకాశాలొచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం" అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
"ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని నిరాశకు గురిచేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పలు అవకాశాలు చిక్కినా వాటిని అందిపుచ్చుకోలేకపోయాం. దీంతో ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో వాటిని గమనించి సరిద్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్ఇండియా కొన్నేళ్లుగా ప్రత్యర్థులను 20 వికెట్లు తీసి విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ, కొన్ని నెలలుగా ఆ పనిచేయలేకపోతోంది. అందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఇటీవలి కాలంలో విదేశాల్లో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట బాగానే ఆరంభిస్తున్నా చివరికి విజయాలు సాధించలేకపోతున్నాం" అని ద్రవిడ్ వివరించాడు.
Bumrah on teamindia lose match: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటవ్వడమే తమ కొంప ముంచిందని తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా అన్నాడు. టీమ్‌ఇండియా మూడు రోజుల పాటు బాగా ఆడిందని.. కానీ, నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడంతో ఇంగ్లాండ్‌కు అవకాశం ఇచ్చామని పేర్కొన్నాడు. దీంతో తాము అక్కడే మ్యాచ్‌లో వెనుకబడిపోయామని చెప్పాడు. అయితే, గతేడాది జరిగిన తొలి టెస్టులో వర్షం పడకుంటే టీమ్‌ఇండియానే సిరీస్ గెలిచేదని బుమ్రా అభిప్రాయపడ్డాడు. కాగా, ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించే క్రమంలో వర్షం అంతరాయం కారణంగా డ్రాగా ముగిసింది.
ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అతడు స్టువర్ట్‌బ్రాడ్ బౌలింగ్‌లో 35 పరుగులు సాధించడంపై స్పందిస్తూ.. దానికి తానేం ఆల్‌రౌండర్‌లా ఫీలవ్వట్లేదని స్పష్టం చేశాడు. అలాగే ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాగా ఆడారని.. దీంతో వారు సిరీస్‌ను సమం చేసుకున్నారని మెచ్చుకున్నాడు. ఇది సరైన ఫలితమేనని, ఈ ఓటమి పట్ల విచారపడట్లేదని తెలిపాడు. అనంతరం టీమ్‌ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలపై స్పందించిన అతడు.. వారిద్దరూ తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్నారని ప్రశంసించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా పంత్ చెలరేగిపోతున్నాడన్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడని వివరించాడు. అలాగే జట్టు బాధ్యతలు తీసుకోవడం తనకు ఇష్టమే అయినా భవిష్యత్ కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా ఈ మ్యాచ్ తనకు మంచి అనుభవం ఇచ్చిందని బుమ్రా పేర్కొన్నాడు.
Bairstow century: ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది భారత జట్టు. అయితే జోరూట్ (142), బెయిర్‌స్టో (114) గొప్పగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్‌ను గెలిపించారు. దీంతో సిరీస్ సైతం 2-2తో సమమైంది. దీనిపై మాట్లాడిన ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106; 114) బాదాక తనలో వైఫల్యాల భయం పోయిందని అన్నాడు. కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడిన అతడు ఈ సంవత్సరం ఏకంగా ఆరు శతకాలు బాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు.
"ఇప్పుడు మా జట్టులో చాలా సంతోషం నెలకొంది. గతనెల కూడా మాకు అద్భుతంగా గడిచింది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. నేను బ్యాటింగ్‌లో ప్రాథమిక అంశాలకే కట్టుబడి ఉన్నా. అయితే, కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన లేక ఇబ్బంది పడ్డా. కానీ గతకొన్ని నెలలుగా అద్భుతంగా ఆడుతున్నా. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అలాగే నేను కూడా ఇప్పుడెంతో ఆనందంగా ఉన్నా. ఇప్పుడిక వైఫల్యాల గురించి భయపడట్లేదు. నా ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నా. కానీ, మేం ఇలా దూకుడుగా ఆడితే మ్యాచ్‌లు కోల్పోయే ప్రమాదం ఉంది. అయినా దీన్ని సానుకూలంగా తీసుకొని సరదాగా ఆడుతున్నాం" అని బెయిర్‌స్టో అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి: IND VS ENG: ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే