ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడేందుకు తాను పనికి రాననని చాలామంది అన్నారని ఆ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) తెలిపాడు. ఖవాజాకు ఐదేళ్ల వయసున్నప్పుడు అతడి కుటుంబం పాకిస్థాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. అక్కడే అతను క్రికెట్ శిక్షణ ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగాడు. అయితే అతను ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో తాను జాతి వివక్షకు గురయ్యానని ఖవాజా చెప్పాడు.
"నేను కుర్రాడిగా ఉన్నప్పుడు.. 'ఆస్ట్రేలియా జట్టుకు నువ్వు ఆడలేవు' అనేవాళ్లు. నా శరీర రంగు సరిగా లేకపోవడం వల్ల సెలక్టర్లు నన్ను ఎంపిక చేసే అవకాశం లేదని చెప్పి నిరుత్సాహపరిచేవాళ్లు. అప్పట్లో జనాల్లో అలాంటి మనస్తత్వం ఉండేది. కానీ ఈ పరిస్థితి నెమ్మది నెమ్మదిగా మారుతూ వచ్చింది."
-ఉస్మాన్ ఖవాజా, ఆస్ట్రేలియా క్రికెటర్.
అయితే కొంతమంది మాత్రం తాను క్రికెట్లో ఎదగడాన్ని హర్షించేవాళ్లని ఉస్మాన్ చెప్పాడు. 2011లో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఖవాజా.. ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం క్రికెటర్‌గా నిలిచాడు. అతడు కంగారూ జట్టు తరుపున ఇప్పటిదాకా 44 టెస్టులు ఆడాడు.
ఇదీ చదవండి: MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ విషయం అలా తెలిసింది