తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ.. పూర్వపు ఫామ్‌లోకి తిరిగి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో నాటి ఆటతీరును కూడా గుర్తుకు తెచ్చుకొంటున్నాడు. ధోనీ సాహచర్యాన్ని విరాట్ అద్భుతంగా ఆస్వాదించాడు. వీరిద్దరూ బరిలోకి దిగితే.. అలవోకగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవారు.
గురువారం రాత్రి విరాట్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిలో ధోని నాయకత్వంలో ఆడిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు. అవే తన జీవితంలో అత్యుత్తమంగా ఎంజాయ్ చేసిన ఉత్తేజపూరితమైన రోజులుగా అభివర్ణించాడు. "ఈ వ్యక్తికి డిప్యూటీగా ఉన్న సమయం.. నా కెరీర్‌లోనే బాగా ఎంజాయ్ చేసిన ఉత్తేజకరమైన రోజులు. మా భాగస్వామ్యాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. 7+18" అని హార్ట్ సింబల్‌తో ట్వీట్ చేశాడు. ధోనీ జెర్సీ నంబర్ 7 కాగా.. విరాట్‌ది 18. ఈ ట్వీట్‌కు వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నప్పటి ఫొటో జత చేశాడు.
కోహ్లీ భారత నాయకత్వ పగ్గాలు చేపట్టేలా ధోనీ తీర్చిదిద్దిన మాట వాస్తవం. కోహ్లీ కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ వద్ద సలహాలు కూడా తీసుకొన్నాడు. తాజాగా రెండు పర్యటనల నుంచి విశ్రాంతి తీసుకొన్న కోహ్లీ.. ఆసియాకప్‌లో ఈ నెల 28వ తేదీన పాక్‌తో జరిగే మ్యాచ్‌లో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
ఇదీ చూడండి: బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్