Vijay Hazare Trophy 2021 Hyderabad: విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 49 ఓవర్లలో 221 పరుగులు చేసింది. 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో రవితేజ (63; 86 బంతుల్లో 6×4, 1×6) జట్టును ఆదుకున్నాడు. సుమంత్ (32)తో కలిసి అతడు ఐదో వికెట్‌కు 76 పరుగులు జత చేశాడు. వీరిద్దరితో పాటు తనయ్ త్యాగరాజన్ (22), మిలింద్ (20 నాటౌట్), అభిరథ్ (22), తిలక్‌వర్మ (20) తలా చేయి వేయడం వల్ల హైదరాబాద్ మోస్తరు స్కోరు చేయగలిగింది. ప్రేరక్ మన్కడ్ (4/54) ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
హర్విక్ దేశాయ్ (101 నాటౌట్; 108 బంతుల్లో 13×4, 2×6) అజేయ సెంచరీతో లక్ష్యాన్ని సౌరాష్ట్ర 39 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. హర్విక్‌తో పాటు షెల్డన్ జాక్సన్ (65) రాణించాడు. బౌలింగ్‌లో సత్తా చాటిన ప్రేరక్ మన్కడ్ (49 నాటౌట్; 50 బంతుల్లో 4×4, 2×6) బ్యాటింగ్‌లోనూ మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆంధ్ర బోణీ
Vijay Hazare Trophy 2021 Andhra: గిరినాథ్ రెడ్డి (4/29), చీపురుపల్లి స్టీఫెన్ (3/37) విజృంభించడం వల్ల ఈ టోర్నీలో రెండు ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఆంధ్ర. శనివారం జరిగిన గ్రూప్-‘ఎ మ్యాచ్‌లో ఆంధ్ర 2 వికెట్ల తేడాతో జమ్ము కశ్మీర్‌ను ఓడించింది. మొదట జమ్ము 48.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. గిరినాథ్, స్టీఫెన్‌తో పాటు హరిశంకర్‌రెడ్డి (2/25) రాణించాడు. 99 పరుగులకే కశ్మీర్ 9 వికెట్లు కోల్పోగా.. రామ్ దయాళ్ (116 నాటౌట్; 100 బంతుల్లో 13×4, 4×6) అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. నజీర్ (27)తో కలిసి చివరి వికెట్‌కు అతడు 109 పరుగులు జత చేయడం విశేషం.
ఛేదనలో ఆంధ్ర 106/4తో తడబడింది. ఈ స్థితిలో రికీ భుయ్ (56), అంబటి రాయుడు (39) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రికీ ఔటైనా.. తపస్వి (16), గిరినాథ్ (19 నాటౌట్)తో కలిసి రాయుడు మ్యాచ్‌ను చివరిదాకా తీసుకొచ్చాడు. రాయుడు వెనుదిరిగినా స్టీఫెన్ (7 నాటౌట్) తోడుగా గిరినాథ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఆంధ్ర 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.