Vijay Hazare Trophy Andhra: విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌లో గెలిచినా నెట్ రన్‌రేట్‌లో వెనకబడ్డ ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఎలైట్ గ్రూప్-ఎ పోరులో ఆంధ్ర 81 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేఎస్ భరత్ (156; 138 బంతుల్లో 16×4, 7×6) వరుసగా రెండో సెంచరీ బాదేశాడు. తన కళాత్మక బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా బౌండరీలతో చెలరేగాడు. ఒంటరి పోరాటంతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 41.3 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఉమాంగ్ (55) టాప్ స్కోరర్. ఆంధ్ర బౌలర్లలో మనీశ్ (4/30) సత్తాచాటాడు. గిరినాథ్ రెడ్డి (2/48) కూడా మెరిశాడు.
ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆంధ్ర తిరిగి పుంజుకుని వరుసగా మూడు విజయాలు నమోదు చేసి 12 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ గ్రూప్‌లో హిమాచల్ ప్రదేశ్, విదర్భ కూడా సరిగ్గా అన్ని పాయింట్లే సాధించాయి. కానీ ఆంధ్ర (0.042) కంటే హిమాచల్ ప్రదేశ్ (0.551), విదర్భ (0.210) నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. దీంతో తొలి స్థానంతో హిమాచల్ నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. రెండో స్థానంలో నిలిచిన విదర్భ ప్రి క్వార్టర్స్ ఆడుతుంది. మూడో స్థానంతో ఆంధ్ర నిష్క్రమించాల్సి వచ్చింది.
హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి
Vijay Hazare Trophy Hyderabad: హ్యాట్రిక్ ఓటమితో టోర్నీని ముగించింది హైదరాబాద్. మంగళవారం ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో ఈ జట్టు 36 పరుగుల తేడాతో జార్ఖండ్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. విరాట్ సింగ్ (65), ఇషాంక్ (44), కుమార్ (43), సౌరభ్ తివారి (42) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ (6/63) ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. త్రిశాంక్ (2/27) రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ 48.4 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (59), రాహుల్ (45) మాత్రమే పోరాడారు. ఛేదనలో జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మంచి ఆరంభాలను బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో వరుణ్ ఆరోన్ (3/50), షాబాజ్ నదీమ్ (3/32) చెరో మూడు వికెట్లతో హైదరాబాద్‌ను కట్టడి చేశారు.
ఈ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి జోరు మీద కనిపించిన హైదరాబాద్.. ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. 8 పాయింట్లతో గ్రూపులో నాలుగో స్థానంలో నిలిచింది.