లంకతో తొలి వన్డే విజయానంతరం తన బ్యాటింగ్‌పై స్పందించాడు యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొడతానని అందరికీ ముందే తెలుసని అంటున్నాడు. ఈ విషయాన్ని సహచరులకు ముందే చెప్పానని తెలిపాడు.
"నా మొదటి బంతిని స్టాండ్స్‌లోకి పంపుతానని అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే వారందరికీ ముందే చెప్పాను. వికెట్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. దీంతో పాటు నా బర్త్ డే ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్లో నాకు తొలి మ్యాచ్. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కదా.. రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తావు అని సహచరులు అడిగారు. నా బ్యాటింగ్‌తోనే వారికి బహుమతి ఇచ్చేశాను. అందుకే హుషారుగా మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాను."
-ఇషాన్ కిషన్, భారత యువ వికెట్ కీపర్.
ద్రవిడ్ ముందే చెప్పారు..
"ప్రాక్టీస్ సెషన్ సందర్భంగానే నా బ్యాటింగ్ స్థానంపై ద్రవిడ్ సార్ స్పష్టత ఇచ్చారు. నేను వన్ డౌన్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని చెప్పారు. కొత్త బంతిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచించుకున్నా" అని కిషన్ పేర్కొన్నాడు.
చెత్త ప్రదర్శనలు ఏం చేయలేవు..
ఫామ్‌లేమితో సతమతమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లంకతో తొలి వన్డేలో రెండు వికెట్లతో రాణించాడు. ఒకటి రెండు చెత్త ప్రదర్శనలు ఆటగాడి కెరీర్‌ను ముగించలేవని అతడు పేర్కొన్నాడు. కానీ, ఆటకు చాలా కాలం దూరంగా ఉంటే ఆటతీరుపై స్వీయ సందేహాలు వస్తాయని తెలిపాడు.
ఈ ఏడాది ఆరంభంలో పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన కుల్దీప్.. మళ్లీ క్రికెట్లోకి వచ్చేది అనుమానమేనని చాలా మంది భావించారు. కానీ, తానెప్పుడు అలా భావించలేదని అంటున్నాడు ఈ ఎడమచేతి వాటం బౌలర్. "నేను 5 వికెట్ల ప్రదర్శనలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడరు. నిజానికి పుణె పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. స్పిన్నర్లకు ఏ మాత్రం పిచ్ నుంచి సహకారం లభించలేదు" అని కుల్దీప్ వెల్లడించాడు.
లంకతో వన్డేకు ముందు తనపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉందని కుల్దీప్ పేర్కొన్నాడు. కోచ్ ద్రవిడ్ విలువైన సూచనలు తనకెంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: షకీబ్ పోరాటంతో బంగ్లా గెలుపు.. పాక్‌పై ఇంగ్లాండ్ ప్రతీకారం