టెస్టు ఛాంపియన్షిప్ పైనల్లో(world test championship final) ఓటమి తర్వాత తుదిజట్టు విషయంలో టీమ్ఇండియా సందిగ్ధంలో పడింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమష్టిగా విఫలమవడం వల్ల తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను చేజేతులా చేజార్చుకున్న కోహ్లీసేన.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తాచాటాలని భావిస్తోంది. అందుకోసం జట్టులో కొన్ని మార్పులు చేయాలని చూస్తోంది.
గిల్ స్థానంలో రాహుల్
టీమ్ఇండియా పరిమిత ఓవర్ల జట్టులో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు కేఎల్ రాహుల్(KL Rahul). టెస్టుల్లోనూ ఇతడు సత్తాచాటినా.. గిల్ రాకతో ఇతడికి చోటు కష్టమైంది. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతోన్న గిల్(gill) స్థానంలో రాహుల్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు గిల్. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 64 బంతుల్లో 24 పరుగులతో కాసేపు క్రీజులో నిలిచినా.. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముందు ఫామ్‌తో సతమతమవుతోన్న గిల్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది.
గత ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్‌ను గిల్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇతడు ఓవల్ వేదికగా జరిగిన చివరి ఇన్నింగ్స్‌లో 149 పరుగులతో సత్తాచాటాడు. దీంతో రోహిత్‌తో(Rohit sharma) పాటు రాహుల్ ఓపెనర్‌గా కనిపించే అవకాశం ఉంది.
జడేజా స్థానంలో విహారి
విదేశాల్లో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా మిడిలార్డర్లో జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ కనిపించడం లేదు. ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఇదే తీరు కనిపించింది. దీంతో ఈ విభాగంలో పలు మార్పులు చేయాలని చూస్తోందీ కోహ్లీసేన.
టీమ్ఇండియాకు జడేజా(Jadeja) ఎంత గొప్ప విజయాలు అందించాడో మరిచిపోలేం. అతడో గొప్ప ఆటగాడు. కానీ ఇంగ్లాండ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించడం వల్ల జడేజా జట్టులో ఉండటం అనుమానంగా మారుతోంది. టెస్టు ఛాంపియన్షిప్ పైనల్లో పిచ్ పరిస్థితిని అంచనా వేయకుండా ఇద్దరు స్పిన్నర్లు తీసుకున్న జట్టు తగిన మూల్యమే చెల్లించుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఈ తప్పు మళ్లీ చేయకూడదని అనుకుంటోంది. ఇదే జరిగితే జడేజా డగౌట్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంటుంది.
ఇంగ్లాండ్ పిచ్‌లపై హనుమ విహారి ప్రదర్శన బాగానే ఉంది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా ఆధిపత్యం వహించాలంటే మరో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం. తన టెక్నిక్‌తో దిగ్గజాల ప్రశంసలు పొందిన విహారి ఈ స్థానానికి తగిన వాడిననని చాలాసార్లు నిరూపించాడు. దీంతో జడేజా స్థానంలో విహారిని జట్టులోకి తీసుకునే విషయమే పరిశీలిస్తోంది.
ఇషాంత్ స్థానంలో సిరాజ్ లేదా శార్దూల్
న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీసేన మన్నికైన స్వింగ్ బౌలర్‌ను మిస్ అయింది. భువనేశ్వర్ కుమార్ శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పయనమవగా.. సిరాజ్(Siraj) లేదా శార్దూల్‌లో ఒకరిని ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం బరిలే దించే అవకాశం ఉంది. 100 టెస్టులు ఆడిన అనుభవం కలిగిన ఇషాంత్.. కివీస్‌తో మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. గాయంతోనే ఫైనల్లో ఆడిన ఇతడిని ఇంగ్లాండ్ సిరీస్‌కు పక్కనపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో తన బౌలింగ్‌తో సత్తాచాటిన సిరాజ్ కొంత కాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. దీంతో అదరూ తుదిజట్టులో ఇతడికి చోటు దక్కుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. కానీ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇతడు జట్టులోకి వచ్చే అవకాశాలు ఉంది.
ఒకవేళ కోహ్లీసేన ఆల్‌రౌండర్‌తో బరిలో దిగాలనుకుంటే శార్దూల్ ఠాకూర్‌ను బరిలో దించే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్లు పేస్ బౌలింగ్‌తో పాటు కీలక సమయంలో బ్యాట్‌తోనూ ఇతడు రాణించగలడు. అందువల్ల ఇషాంత్ స్థానంలో సిరాజ్, శార్దూల్‌కు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి.