దక్షిణాఫ్రికాతో 5 టీ-20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు రెండో టీ-20లో పుంజుకోవాలని భావిస్తోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ-20లో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించినా... బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పరాజయం తప్పలేదు. సీనియర్ పేసర్ భువనేశ్వర్, ఐరీఎల్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న చాహల్ సహా మిగితా బౌలర్లంతా విఫలం కావడంతో పర్యాటక జట్టు గెలుపు లాంఛనమైంది. తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ తొలి మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. భవిష్యత్‌లో జట్టు పగ్గాలు చేపట్టేందుకు పంత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది.
బౌలింగ్ విభాగంలో రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ఉమ్రన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లలో ఎవరో ఒకరు రెండో మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ చేజారితే సిరీస్‌ను గెలవాలంటే ఆ తర్వాతి 3 టీ-20ల్లోనూ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీద ఉన్న దక్షిణాఫ్రికా అదే జట్టుతో బరిలోకి దిగనుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి : 'చాలా కష్టపడ్డా.. పెద్ద యుద్ధమే చేశా.. ఇప్పుడు నేను హ్యాపీ'