ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కోహ్లీ, రహానె క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్, బౌల్ట్ తలో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల కోహ్లీసేన పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది.
శుభారంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు రోహిత్-గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్నట్లు అనిపించిన ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. ఓ ఊరించే బంతితో రోహిత్ (68 బంతుల్లో 34 పరుగులు)ను బోల్తా కొట్టించాడు. స్లిప్స్‌లో సౌథీకి చిక్కాడు. మరో పరుగు తేడాతో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(64 బంతుల్లో 28 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు. వాగ్నర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన టీమ్ఇండియా నయావాల్.. కొద్ది సేపు కివీస్ బౌలర్లను ప్రతిఘటించాడు. ఏకంగా 54 బంతులు ఆడి కేవలం 8 పరుగులే చేసిన పుజారాను ట్రెంట్ బౌల్ట్ ఓ చక్కని బంతితో ఎల్బీగా వెనక్కి పంపాడు.
ఆదుకున్న కెప్టెన్-వైస్ కెప్టెన్..
62 పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండా ఆడుతున్న కోహ్లీ సేన మరి కొద్ది సేపటికే 88కే టాప్-3 బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ఇక కష్టాలు తప్పవనుకున్న స్థితిలో కెప్టెన్‌కు తోడుగా వైస్ కెప్టెన్ నిలిచాడు. కోహ్లీ (124 బంతుల్లో 44)తో కలిసిన రహానె(79 బంతుల్లో 29 పరుగులు) నాలుగో వికెట్‌కు 58 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టును కాస్త పటిష్ఠ స్థితికి చేర్చారు. దుర్భేద్యమైన డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. వీలైనప్పుడల్లా సింగిల్స్, డబుల్స్‌తో తీస్తూ పరుగులు జోడించారు.
కోహ్లీ@7500..
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ మ్యాచ్ ద్వారా మరి కొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్‌ల్లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన తొలి సారథిగా సరికొత్త ఫీట్ సాధించాడు. ఇంతకు ముందు మాజీ కెప్టెన్ ధోనీతో సమానంగా 60 టెస్ట్‌ల్లో భారత్‌కు సారథ్యం వహించాడు విరాట్. తాజా మ్యాచ్‌తో కోహ్లీ 61 మ్యాచ్‌ల్లో భారత్‌ను ముందుండి నడిపించినట్లైంది. అత్యధిక టెస్ట్ కెప్టెన్లుగా ఉన్న జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ అందరికంటే ముందంజలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌కు ముందు 7500 పరుగులు చేయడానికి మరో 10 పరుగుల దూరంలో ఉన్నాడు కోహ్లీ. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 44 పరుగులతో అజేయంగా నిలిచాడు విరాట్. దీంతో సుదీర్ఘ ఫార్మాట్లో 7500 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న తొమ్మిదో బ్యాట్స్‌మన్. మొత్తంగా 42వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో ఈ ఘనత అందుకోవడానికి సునీల్ గావస్కర్‌తో సమానంగా కోహ్లీకి కూడా 154 ఇన్నింగ్స్‌లే అవసరమయ్యాయి. వీరికంటే ముందు సచిన్ 144 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
వెలుతురులేమీ..
డబ్ల్యూటీసీ మ్యాచ్‌కు ప్రారంభం నుంచి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోయింది. ఇక సాఫీగా జరుగుతుందనుకున్న రెండో రోజూ వెలుతురులేమీ కారణంగా మ్యాచ్ పలుమార్లు ఆగిపోయింది. మబ్బులు దట్టంగా పట్టడం వల్ల ఫ్లడ్‌లైట్ల వెలుతురు సరిపోలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు కేవలం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది.
నల్లని రిబ్బన్లతో..
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతికి సంతాపం ప్రకటించింది టీమ్ఇండియా. మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు నల్లని బ్యాండ్‌ను చేతులకు ధరించి ఆటలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: WTC Final: కెప్టెన్‌గా కోహ్లీ.. ఆటగాడిగా రోహిత్ రికార్డులు