టీమ్ఇండియాలో కొంతమంది యువ ఆటగాళ్లు దొరికిన అవకాశాలను వృథా చేసుకుంటుంటే.. సీనియర్ ఆటగాళ్లు మాత్రం లేటు వయసులో అదరగొడుతున్నారు. వారెవరంటే..
మళ్లీ వచ్చాడు.. ఎక్కువ వేగం లేకపోయినా వైవిధ్యంతో ఆరంభంలో ఆకట్టుకున్న భువి ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగయ్యాడు. యువ పేసర్లు దూసుకు రావడంతో రేసులో వెనుకబడిపోయాడు. కానీ కాస్త వేగం పెంచుకున్న అతడు వైవిధ్యానికి మరింత పదునుపెట్టి ఉపయుక్తమైన బౌలర్‌గా మారాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడమే కాదు డెత్ ఓవర్లలో పాత బంతితోనూ అతడు అదరగొడుతున్నాడు. స్లో బౌన్సర్లు, నకుల్ బాల్స్‌తో బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాడు. ఈ అస్త్రాలతోనే ఐపీఎల్-15లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 12 వికెట్లు తీసిన ఈ పేసర్.. తాజాగా సఫారీలతో సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. కటక్‌లో జరిగిన రెండో టీ20లో అతడు 13 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. వీటిలో మూడు బౌల్డ్ ఉన్నాయంటే అతడు ఎంతగా బ్యాటర్లను మాయ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్ఛు దీని కంటే ముందు చివరిగా 2013లో అతడు శ్రీలంక, వెస్టిండీస్‌తో మూడు దేశాల టీ20 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.
అవే షాట్లు.. అవే ఔట్లు.. రిషబ్ పంత్.. భారత్‌కు దొరికిన ఆణిముత్యం. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాడతను. కానీ ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో విలువైన అవకాశాలను వృథా చేస్తూ అతడు జట్టు అవకాశాలను దెబ్బ తీస్తున్నాడు. ఐపీఎల్-15లో 14 మ్యాచ్‌ల్లో 340 పరుగులే చేయగలిగిన పంత్.. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అయిదు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. క్రీజు వదిలి ముందుకు రావడం, ఆఫ్‌సైడ్ దూరంగా పడిన బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఔట్ కావడం అతడికి అలవాటుగా మారింది. ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటూ దక్షిణాఫ్రికా బౌలర్లు పంత్‌కు ఆఫ్ వికెట్‌కు దూరంగానే బంతులు విసిరి అనుకున్న ఫలితం సాధించారు. బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గా ఈ సిరీస్‌లో పంత్ విఫలమయ్యాడు. భారత్ ఓడిన సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పంత్ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. దీంతో జట్టులో అతడి స్థానానికే ముప్పు ఏర్పడింది. దినేశ్ కార్తీక్‌కు తోడు ఒకవైపు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాంటి వికెట్‌కీపర్ బ్యాటర్ల నుంచి పోటీ ఉన్న స్థితిలో అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం పంత్‌పై ఒత్తిడి పెంచుతోంది. ఈ ఏడాది ఆఖర్లోనే టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రిషబ్ గాడిలో పడాల్సిన అవసరం ఎంతో ఉంది.
అతనో అద్భుతం.. దినేశ్ కార్తీక్.. అభిమానులకు అతడో అద్భుతం.. కారణం అతడి మెరుపు ఫామే. ఎప్పుడో 2006లో భారత్ తన తొట్టతొలి టీ20 ఆడితే అందులో దినేశ్ సభ్యుడిగా ఉన్నాడు. అతడితో పాటు ఈ మ్యాచ్ ఆడినవాళ్లలో చాలామంది రిటైర్ అయ్యారు లేదా జట్టులో లేరు. కానీ కార్తీక్ ఇంకా జట్టుతోనే ఉన్నాడు. మధ్యలో ఫామ్ కోల్పోయి అతడొకడు ఉన్నాడనే విషయమే అభిమానులు మరిచిపోయే స్థితికి వచ్చాడు. 2018 బంగ్లాదేశ్‌తో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి సంచలన రీతిలో భారత్‌ను విజేతగా నిలబెట్టిన కార్తీక్.. ఆ తర్వాత కొంత కాలం జట్టులో ఉన్నా ఆ తర్వాత మళ్లీ దూరమయ్యాడు. ఆపై తాత్కాలిక వ్యాఖ్యాతగా కూడా మారాడు. అయితే 2022 ఐపీఎల్ కార్తీక్‌కు జీవం పోసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 16 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేసిన కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫినిషర్ పాత్రకు న్యాయం చేశాడు. అదే జోరును దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ కొనసాగించాడు. నాలుగో టీ20లో ధాటిగా ఆడి మెరుపు అర్ధసెంచరీతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఈ సిరీస్‌లో 158.62 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన అతడు రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక ఆటగాడవుతాడని భావిస్తున్నారు.
ప్రతిభ ఉన్నా.. రుతురాజ్ గైక్వాడ్.. మూడు ఫార్మాట్లలో ఆడగల ప్రతిభావంతుడు.. స్థిరంగా రాణించగల బ్యాటర్ అంటూ మాజీలు పొగడ్తలతో ముంచెత్తారు ఈ కుర్రాడిని. ఐపీఎల్-14లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటిన ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు గతేడాది శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారత జట్టులో స్థానం దక్కింది. కానీ అతడు ఈ సువర్ణావకాశాన్ని పెద్దగా ఉపయోగించుకున్నదే లేదు. ఇప్పటిదాకా 8 టీ20లు ఆడి 135 పరుగులే చేశాడతను. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల్లోనూ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న రుతురాజ్ వరుసగా 23, 1, 57, 5, 10 స్కోర్లు చేశాడు. వరుసగా విఫలమైనా కోచ్ ద్రవిడ్ అండతో అవకాశాలు దక్కించుకున్న రుతురాజ్ అయిదు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే చేయగలిగాడు. రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్‌శర్మ జట్టులో లేకపోవడంతో ఈ అవకాశాలు పొందిన రుతురాజ్‌కు వాళ్లు తిరిగి వస్తే మళ్లీ మ్యాచ్‌లు ఆడతాడన్న గ్యారెంటీనే లేదు. మరి ఈ స్థితిలో ఈ కుర్రాడు ఇంత విలువైన అవకాశాల్ని దుర్వినియోగం చేయడం నిరాశ కలిగించేదే.
ఇదీచూడండి: టీ, బన్స్ సప్లయర్‌గా మాజీ క్రికెటర్.. కష్టాలు చూడలేక...