ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముందు భారత అమ్మాయిల క్రికెట్ జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో ముక్కోణపు టీ20 సిరీస్‌లో తలపడనుంది. గురువారం తొలి మ్యాచ్‌లో సఫారీ జట్టుతో టీమ్‌ఇండియా పోటీపడనుంది. వచ్చే నెల 10న దక్షిణాఫ్రికాలోనే పొట్టి కప్పు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీకి మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు, స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు హర్మన్‌ప్రీత్ సేనకు ఈ సిరీస్ మంచి అవకాశం. మూడు విభాగాల్లోనూ మెరుగవ్వాలని చూస్తున్న భారత్.. ఈ సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 1-4తో చిత్తయిన టీమ్‌ఇండియా.. బలహీనతలను అధిగమించాల్సి ఉంది. ఆ సిరీస్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి. దాదాపు 15 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ శిఖా పాండే ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం. గాయంతో ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన పేస్ ఆల్‌రౌండర్ పూజ వస్త్రాకర్ కూడా పునరాగమనం చేయనుంది. అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న షెఫాలి, రిచా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో స్మృతితో కలిసి తెలుగమ్మాయి సబ్బినేని మేఘన ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో జెమీమా, కెప్టెన్ హర్మన్ కూడా కీలకం కానున్నారు.