టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అస్వస్థతకు గురైనట్లు వచ్చిన వార్తలను కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించాడు. అతడు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడటం లేదని, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని స్పష్టం చేశాడు. తుమ్మినా? దగ్గినా అస్వస్థతకు గురైనట్లేనా? అని ప్రశ్నించాడు. కాస్త దగ్గుతో కోహ్లీ బాధపడ్డాడని, అది పెద్ద సమస్య కాదని పేర్కొన్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు.
ఈ సెంచరీని ప్రశంసించిన అతడి సతీమణి అనుష్క శర్మ.. కోహ్లీ ఆరోగ్యం బాగోలేదని, అయినా సెంచరీ చేశాడని సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో కోహ్లీ అన్‌ఫిట్‌గా ఉన్నాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నాలుగో టెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ ఈ వార్తలను ఖండించాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ దాన్ని గుడ్డిగా నమ్మకూడదని కోరాడు. 'సోషల్ మీడియాలో చూసేదాన్ని గుడ్డిగా నమ్మకండి. విరాట్ అస్వస్థతకు గురయ్యాడని అనుకోకండి. కేవలం అతడు దగ్గుతో బాధపడ్డాడు.'అని రోహిత్ స్పష్టం చేశాడు.
నాలుగో రోజు ఆట అనంతరమే అక్షర్ పటేల్ సైతం ఇదే విషయాన్ని తెలియజేశాడు. 'కోహ్లీ అస్వస్థతకు గురైనట్లు నాకు అనిపించలేదు. వికెట్ల మధ్య కోహ్లీ పరుగెత్తిన విధానం మాత్రం అతను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లే అనిపించింది. ఇంతటి వేడి వాతావరణంలో గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వికెట్ల మధ్య బాగా పరుగెత్తాడు. అతడితో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది' అని అక్షర్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ వల్లే చివరి టెస్ట్‌ను డ్రా చేసుకోగలిగామని రోహిత్ తెలిపాడు. కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతడి సత్తా ఏంటో తమకు తెలుసున్నాడు. కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడితే అతడు ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకం తమకు ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్సీని అస్వాదిస్తున్నానని చెప్పిన రోహిత్.. ఏమైనా తప్పిదాలు చేస్తుంటే అప్పటికప్పుడే సరిదిద్దుకుంటున్నానని తెలిపాడు. సహచర ఆటగాళ్ల సలహాలు తీసుకుంటున్నానని చెప్పాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఫాస్ట్ బౌలర్లకు ఐపీఎల్ సమయంలోనే డ్యూక్ బాల్స్ అందజేస్తామన్నాడు. ఐపీఎల్ జరుగుతుండగానే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధం చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భాగమయ్యే ప్రతీ ఒక్కరిని మానిటర్ చేస్తామని స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఏ టీమ్‌లో ఉన్నా.. బీసీసీఐ పర్యవేక్షణలోనే ప్రాక్టీస్ చేస్తారని తెలిపాడు.