అంతర్జాతీయ క్రికెట్లో.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అఫ్గానిస్థాన్ (T20 worldcup 2021) మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. అందుకే ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచి క్వాలిఫయర్స్‌తో అవసరం లేకుండా ఈ ప్రపంచకప్‌లో నేరుగా సూపర్-12 మ్యాచ్‌లు ఆడే అవకాశం కొట్టేసింది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్- 2లో ఉన్న ఆ జట్టు.. కనీసం ఒక్క విజయమైనా సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ అగ్రశ్రేణి జట్లను ఓడించి.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లోపు నిలిచి అఫ్గాన్ సెమీస్ చేరడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ జట్టు ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.
ఇటీవల కాలంలో ఆ జట్టు పెద్దగా టీ20 మ్యాచ్‌లాడలేదు. కానీ ఆడిన గత మూడు సిరీస్‌ల్లోనూ (వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే) గెలిచింది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్‌పై సిరీస్ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఆ జట్టు ఆశలన్నీ స్పిన్నర్ రషీద్ ఖాన్ మీదే ఉన్నాయి. తన ప్రమేయం లేకుండానే జట్టును ఎంపిక చేశారని ఒక్క మ్యాచ్‌కూ నాయకత్వం వహించకుండానే టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన రషీద్.. బంతితో జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరో స్పిన్నర్ ముజీబ్ కూడా ప్రమాదకారే. ఇక నంబర్‌వన్ టీ20 ఆల్‌రౌండర్ మహమ్మద్ నబి.. బ్యాట్, బంతితో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనే నిలకడగా రాణించే ఆటగాడు లేకపోవడం ఇబ్బందిగా మారింది. గుర్బాజ్, హజ్రతుల్లా, అస్గర్ లాంటి బ్యాటర్లపైనే ఆ జట్టు నమ్మకం పెట్టుకుంది.
కీలక ఆటగాళ్లు: రషీద్, ముజీబ్, నబి, గుర్బాజ్
అత్యుత్తమ ప్రదర్శన: సూపర్- 10 (2016)
అఫ్గానిస్థాన్ జట్టు: నబి (కెప్టెన్), అస్గర్, ఫరీద్, గుల్బాదిన్, హమీద్, హష్మతుల్లా, హజ్రతుల్లా, కరీమ్, షాజాద్, ముజీబ్, జాద్రాన్, నవీన్ ఉల్ హక్, గుర్బాజ్, రషీద్, ఉస్మాన్.
ఇదీ చదవండి:ప్రాక్టీస్ అదిరింది.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘనవిజయం