శ్రీలంకతో తొలి టీ20లో విజయం సాధించడంపై కెప్టెన్ ధావన్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసించాడు. "మేం 10-15 పరుగులు తక్కువ చేశాం. తొలి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ తర్వాత బాగా ఆడాం. సూర్య గొప్ప ఆటగాడు. అతడి బ్యాటింగ్ శైలిని బాగా ఆస్వాదించాను. నాపై ఒత్తిడి లేకుండా చేశాడు. అతడు ఆడిన షాట్స్ అద్భుతం" అని ధావన్ అన్నాడు.
స్పిన్నర్లు చాహల్, వరుణ్ చక్రవర్తి, కృనాల్ పాండ్య(ఆల్‌రౌండర్) బాగా ఆడారని ధావన్ చెప్పాడు. "వాళ్లు బాగా ఆడుతున్నారు. స్పిన్నర్లు బాగా రాణిస్తారని తెలుసు. భువీ బౌలింగ్ బాగా చేశాడు. కృనాల్ కూడా. అరంగేట్ర మ్యాచ్‌లోనే వరుణ్ తక్కువ పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం. పృథ్వీ షా అద్భుతమైన ప్లేయర్. ఈ మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ.. తిరిగి పుంజుకుంటాడు" అని గబ్బర్ పేర్కొన్నాడు.
ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 38 పరుగుల తేడాతో గెలిచింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. భువనేశ్వర్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ధావన్ సేన 1-0తో ముందంజలో నిలిచింది.
ఆడేవారికి మాత్రమే చోటు
"ఇది ఆరోగ్యకరమైన పోటీ. 30 మంది ఆటగాళ్లు ఉంటే తప్పకుండా నాణ్యత ఉంటుంది. స్పిన్నర్లు బాగా రాణిస్తున్నారు. నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ముఖ్యంగా నా కోసం నేను ఆడుతున్నాను. ఆడేవారు ఇక్కడ ఉంటారు. లేదంటే.. ఎవరికైనా అవకాశాలు రావు. కాబట్టి బంతి నా చేతిలో ఉన్నప్పుడు పక్కవారి గురించి పట్టించుకోను. కేవలం నా ఆటపైన మాత్రమే దృష్టి పెడతాను. వికెట్లు తీయడంపై లాక్డౌన్లో బాగా ప్రాక్టీస్ చేశాను. నా పాత వీడియోలను చూసుకుంటూ తప్పులను సరిచేసుకున్నాను. నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్లే ఉత్తమంగా బౌలింగ్ చేయగలుగుతున్నాను" అని స్పిన్నర్ చాహల్ అన్నాడు.
ఇదీ చూడండి: IND vs SL:సమష్టిగా రాణించిన బౌలర్లు.. లంకపై భారత్ విజయం