టీమ్ఇండియా-ఇంగ్లాండ్ ఐదో టెస్టు రద్దు కావడం పలువురు మాజీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐపీఎల్, ఈ మ్యాచ్ రద్దుకు (ind vs eng) కారణమని ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిన్సన్ ఆరోపించాడు. టెస్టు ఆడేందుకు టీమ్ఇండియా క్రికెటర్ల విముఖత కూడా మరో కారణమని అన్నాడు. సిరీస్ మధ్యలో కరోనా సోకితే, అనుకున్నదానికంటే సమయం క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందన్న భయం.. ఎక్కువ డబ్బులు సంపాదించుకునే వీలున్న టోర్నీలోని కొన్ని మ్యాచ్‌లను కోల్పోతామనే ఆందోళనతో ఐదో టెస్టు ఆడేందుకు అయిష్టత చూపారని పేర్కొన్నాడు.
సహాయక సిబ్బందిలో నలుగురికి కరోనా సోకడం సహా ఆఖరి టెస్టుకు ముందుకు ఫిజియో యోగేశ్ పర్మార్‌కు పాజిటివ్‌గా తేలడం వల్ల టీమ్ఇండియా క్రికెటర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా టాస్కు కొన్ని గంటల ముందు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మ్యాచ్ రద్దు అయ్యింది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇండియా.. మ్యాచ్‌ను వదిలేసుకుందని తొలుత ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. కాసేపటికే జట్టును బరిలోకి దింపలేకపోతోందని తన వ్యాఖ్యలను సవరించుకుంది. అయితే ఈసీబీ ప్రకటనను కొట్టిపారేశాడు హర్మిన్సన్.
పనికిమాలిన చర్య..
"ఇది నిజంగా పనికిమాలిన చర్య. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంతానికి ఇది ఆరంభం. దీనికి కారణం.. ఐపీఎల్. మరో 5 రోజుల్లో ఆ లీగ్ ప్రారంభం కానుంది. పర్యటనకు నెల ముందుగానే ఐపీఎల్ కోసం టెస్టును ముందుకు జరపాలని టీమ్ఇండియా అడిగింది. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మ్యాచ్ రద్దవడం సరికాదు. డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతుంది. కానీ నిజాయతీ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎలా అంటే.. నా బ్యాటు, నా బాల్... నాకు నచ్చితేనే ఆడతా అని ఇండియా దబాయిస్తున్నట్లుంది"
-హర్మిన్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
ఐపీఎల్ విషయంలో రాజీలేదు..
కిక్కిరిసిన షెడ్యూల్, ఐపీఎల్ లాంటి 'తప్పించలేని టోర్నీ' కారణంగా ఐదో టెస్టు రద్దు అయ్యిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ చెప్పాడు. ఐపీఎల్ విషయంలో టీమ్ఇండియా ఎట్టి పరిస్థితుల్లో రాజీపడదని అన్నాడు.
"భారత్‌కు సంబంధించినంత వరకు ఐపీఎల్ జరగాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న డబ్బు అలాంటిది. కానీ, ఇలా ఓ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే అభిమానులకు విషాదమే మిగిలుతుంది."
-నాసిర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ సారథి
అయితే ఈ పరిస్థితికి క్రికెటర్లను నిందించడం సరికాదని హుస్సేన్ అన్నాడు. వైరస్, కుటుంబానికి దూరంగా క్వారంటైన్ లాంటి భయాలను తోసిపుచ్చలేమని చెప్పాడు. మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేయడానికి ఇంగ్లాండ్ ప్రతినిధులతో చర్చించేందుకు సెప్టెంబర్ 22న యూకే వెళ్లనున్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.
ఇవీ చూడండి: IPL 2021: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు