IND VS SL Shreyas Iyer: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడు మ్యాచులాడిన అయ్యర్ అన్నింటిలోనూ అర్థశతకాలు సాధించి 204 పరుగులు చేశాడు. చివరి టీ20లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన అతడు హర్షం వ్యక్తం చేశాడు.
"ఈ టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన చేశాను. ప్రస్తుతం నాకు కొంత విశ్రాంతి కావాలి. ఎక్కువగా ఆలోచించకుండా ఈ క్షణాన్ని అనుభవిస్తాను. టీ20లో టాప్ ఆర్డర్లో ఆడేటప్పుడు మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించగలం. మిడిల్ఆర్డర్లో వస్తే మెుదటి బాల్ నుంచి ధాటిగా ఆడాల్సి ఉంటుంది. మా జట్టులో చాలా పోటి ఉంది. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సంతోషంగా గడుపుతాను. ప్రతి ఆటను ముగించాలనే ఉద్దేశంతోనే ఆడతాను. నా బ్యాటింగ్ స్థానం, పోటీ గురించి ఆలోచించను. ఏ స్థానంలోనైనా ఆడేలా మలుచుకుంటాను. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే అనుకుంటాను. దాని కోసమే శాయశక్తులా కృషిచేస్తాను. దీనికోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాను. ప్రతి ఆటగాడికి బలం, బలహీనత ఉంటాయి. నా బలాల పైన దృష్టి పెడతాను. షార్ట్ బాల్ నా బలహీనత అని అనుకుంటారు. కానీ నేను దాన్ని పట్టించుకోను. శ్రీలంక ప్లేయర్ షనక గత రెండు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడాడు. బంతులను అలవోకగా బౌండరీలు దాటించాడు. ఈ పరిస్థితుల్లో మా బౌలర్లను నిదించలేము. మా ప్లాన్లతో వచ్చాము కానీ అతడు మా బౌలర్లపై పైచేయి సాధించాడు."
-శ్రేయస్ అయ్యర్, టీమ్ఇండియా బ్యాటర్.
శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచులో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును 146 పరుగులకే కట్టడి చేశారు. లంక కెప్టెన్ షనక 74 పరుగులతో పోరాడాడు. అవేశ్‌ఖాన్ రెండు వికెట్లు, సిరాజ్,హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. ఈ లక్ష్యాన్ని భారత్ 16.5 ఓవర్లలోనే ఛేదించింది.
ఇదీ చదవండి: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మయాంక్.. అధికార ప్రకటన