Shoaib Akhtar about Hardik Pandya Injury: వెన్నెముక సమస్య గురించి టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముందే హెచ్చరించానని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. దుబాయ్‌లో ఓ సమయంలో అతడిని కలిసినప్పుడు ఈ విషయం చెప్పానని తెలిపాడు.
"ఒకసారి నేను దుబాయ్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యాతో మాట్లాడాను. వాళ్లను చూస్తుంటే బక్కపలచగా ఉన్నారు. వాళ్ల వెన్నెముకలు కూడా బలంగా లేవని అనిపించింది. అప్పుడు పాండ్యా తీరికలేని విధంగా క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పాడు. నువ్వు త్వరలోనే గాయపడతావని అతడిని హెచ్చరించా. నేనెలా చెప్పిన గంటన్నరకే అతడు గాయపడ్డాడు" అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
2018 ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో గాయపడ్డాడు బుమ్రా. ఆ తర్వాత అతడికి వెన్నెముక సమస్య వెంటాడింది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పాండ్యా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, ఆ గాయం నుంచి కోలుకున్నాక కూడా అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోతోంది. దీంతో ఇటీవల బౌలింగ్ చేయకుండా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో, టీ20 ప్రపంచకప్‌లో విఫలమయ్యాడు. ఇక తాజాగా ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనకూ అతడిని ఎంపిక చేయలేదు.