ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లోనూ టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవి శాస్త్రి(ravi shastri)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఆయన మరో 10 రోజుల పాటు ఐసోలేషన్‌లోనే ఉంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి (ఐదవ) టెస్టు సమయంలో జట్టుకు దూరంగా ఉండనున్నాడు శాస్త్రి.
ఆదివారం చేసిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో శాస్త్రికి పాజిటివ్‌గా తేలగ, దానిని ధ్రువీకరించుకోవడానికి సోమవారం చేసిన ఆర్టీ-పీసీఆర్లోనూ అదే ఫలితం వచ్చింది. ఆయనకు గొంతులో మంట లాంటి తేలికపాటి లక్షణాలున్నట్లు తెలుస్తోంది.
వారు కూడా ఐసోలేషన్‌లోనే..
శాస్త్రితో సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. క్రికెటర్లు, సిబ్బందికి ఇదివరకే వ్యాక్సినేషన్ పూర్తయింది.
అదే కారణమా?
టీమ్ హోటల్లో తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సమయంలోనే రవిశాస్త్రికి వైరస్ సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆ కార్యక్రమానికి బయటి వ్యక్తులతో పాటు అరుణ్, పటేల్, శ్రీధర్ కూడా హాజరయ్యారు.
సోమవారం ఉత్కంఠభరిత పోరు!
నాలుగో టెస్టు (INDvsENG fourth test) రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 466 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ పరుగుల లోటు మినహాయించి 368 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బదులుగా ఆదివారం ఆట ముగిసే సరికి ఆంగ్లేయులు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశారు. ఓపెనర్లు హసీబ్ హమీద్ (43), రోరీ బర్న్స్ (31) అజేయంగా నిలిచారు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే సోమవారం ఇంకా 291 పరుగులు చేయాలి. ఐదవ టెస్టు సెప్టెంబరు 10న ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: 'రహానె ప్రదర్శనపై ఆందోళన వద్దు.. అతడే కీలకం'