Kohli Shahid Afridi: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అసహనం వ్యక్తం చేశాడు. అతడికి మునుపటిలా రాణించాలనే ఉద్దేశం ఉందా.. లేదా? అని ప్రశ్నించాడు.
కోహ్లీ రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌లోనూ అంతంత మాత్రంగానే మెరిశాడు. ఈ నేపథ్యంలో అఫ్రిది మాట్లాడుతూ.. "క్రికెట్‌లో ఎవరికైనా తమ ఆటపట్ల కచ్చితమైన ఆలోచనా దృక్పథం ఉండాలి. అది చాలా కీలకం. ఇప్పుడు కోహ్లీకి అలాంటి యాటిట్యూడ్ ఉందా లేదా అనేది తెలియాలి. అతడి కెరీర్ ఆరంభంలో ప్రపంచంలో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ స్ఫూర్తితోనే క్రికెట్ ఆడుతున్నాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికీ అతడి ఆటలో క్లాస్ ఉంది. కానీ, మళ్లీ నంబర్ వన్ ఆటగాడిగా ఉండాలనుకుంటున్నాడా..? లేకపోతే ఇప్పటికే అన్నీ సాధించానని భావిస్తున్నాడా? అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటూ టైమ్‌పాస్ చేస్తున్నాడా? ఇదంతా అతడి ఆలోచనా విధానంలోనే దాగిఉంది" అని అఫ్రిది విమర్శించాడు.
కాగా, కోహ్లీ ఈసారి భారత టీ20 లీగ్ 15వ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 341 పరుగులే చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు సాధించగా.. 22.73 సగటు నమోదు చేశాడు. అయితే, త్వరలో టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు అతడికి దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చారు. మరి ఈ విరామం తర్వాతైనా మునుపటి కోహ్లీని బయటకు తీస్తాడో లేదో చూడాలి.
ఇదీ చూడండి: బీసీసీఐ నయా ప్లాన్.. ఇకపై 'వన్ నేషన్ టూ టీమ్స్'గా!