Saurabh Kumar Cricketer: రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా వచ్చే నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. టెస్టు స్పెషలిస్టులు రహానే, పుజారాలు గత కొంతకాలంగా ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిపై వేటు వేసింది బీసీసీఐ. ఆ స్థానంలో యువక్రికెటర్లకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో జట్టులోకి సౌరభ్ కుమార్ అనే మరో కొత్త క్రికెటర్‌కు చోటు కల్పించింది.
అసలు ఎవరు ఈ సౌరభ్ కుమార్?
1993 మే 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో జన్మించిన సౌరభ్‌కుమార్.. స్పిన్ ఆల్‌రౌండర్. అండర్-19, అండర్-22 విభాగాల్లో యూపీ తరపున ఆడాడు. 2014లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్వీసెస్ తరపున ఆడి రంజీల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ 45 పరుగులు చేసిన సౌరభ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ జట్టులో చేరాడు. 46 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 2.70 సగటున 196 వికెట్లు పడగొట్టాడు ఈ స్పిన్నర్. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన రికార్డు సౌరభ్ సొంతం. బ్యాటింగ్‌లోనూ సౌరభ్ మెరుగైన ప్రదర్శనే చేశాడు.. 63 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 1572 పరుగులు చేశాడు. వీటిలో ఎనిమిది అర్ధశతకాలు, రెండు శతకాలు ఉన్నాయి.
ఐపీఎల్లో కూడా..
లిస్ట్-ఏ ఫార్మాట్లో సౌరభ్ ఎకానమీ రేటు 4.38. టీ20ల్లో ఇది 7.03గా ఉంది. అందుకే 2017 ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వేలంలో రైజింగ్ పూణె సూపర్ జయంట్స్ జట్టు రూ.10 లక్షలు వెచ్చించి సౌరభ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఆ సీజన్లో సౌరభ్‌కు అసలు ఆడే అవకాశం రాలేదు. మళ్లీ 2021లో జరిగిన వేలంలో సౌరభ్‌ను రూ.20 లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కానీ ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. సౌరభ్‌కు తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కలేదు.
2015 డిసెంబరు 10న ఉత్తర్‌ప్రదేశ్ తరపున హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో లిస్ట్-ఏ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు సౌరభ్. 10 ఓవర్లలో ప్రత్యర్థికి 36 పరుగులు మాత్రమే ఇచ్చిన సౌరభ్ రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు లిస్ట్-ఏ ఫార్మాట్లో 24 ఇన్నింగ్స్‌లు ఆడిన సౌరభ్ 37 వికెట్లు తీశాడు. 16 ఇన్నింగ్స్‌లో 173 పరుగులు చేశాడు.
ఎప్పటి నుంచో టీమ్ఇండియాలో ఛాన్స్ కోసం నిరీక్షిస్తున్న సౌరభ్‌కు శ్రీలంక సిరీస్‌తో కలనెరవేరినట్లు అయింది. ఈ కొత్త క్రికెటర్‌కు అవకాశం కల్పిస్తే మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి : రోహిత్ పూర్తిస్థాయి కెప్టెన్సీ- వరమా.. భారమా?