Saha tweet viral: భారత క్రికెట్లో టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాడు. ఇటీవలే తనను ఓ జర్నలిస్ట్ బెదరించాడంటూ ఓ వాట్సాప్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపడం వల్ల బీసీసీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. అయితే తాజాగా దీనిపై స్పందించాడు సాహా. తనను బెదిరించిన జర్నలిస్టు గురించి బోర్డు అడిగితే పేరు చెప్పనని తెలిపాడు.
"ఇప్పటివరకూ బీసీసీఐ నన్ను సంప్రదించలేదు. ఒకవేళ నన్ను బెదిరించిన జర్నలిస్టు ఎవరని అడిగితే మాత్రం అతడి కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశం నాకు లేదని చెబుతాను. అందుకే నేను ఆ ట్వీట్‌లో అతడి పేరు వెల్లడించలేదు. ఇతరుల్ని ఇబ్బందులకు గురి చేసే రకం కాదు నేను. నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు. అయితే, నేను ఆ ట్వీట్ చేయడానికి గల కారణం.. మీడియాలోనూ ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడనే నిజాన్ని బయటపెట్టాలనే ఉద్దేశమే. అలా చేయడం మంచిది కాదు. నాకు అలా ఎవరు మెసేజీలు చేశారో అది ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఇతర క్రికెటర్లు ఇలాంటివి ఎదుర్కోకూడదనే నేను ఈ విషయాన్ని ట్వీట్ చేశాను. ఆ వ్యక్తి తప్పు చేశాడనే విషయాన్ని బయటపెట్టాలనుకున్నా. మళ్లీ ఇలా ఎవరూ చేయకూడదనుకున్నా"
-సాహా, టీమ్ఇండియా క్రికెటర్.
కాగా, ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్.. సాహాతో మాట్లాడి ఆ బెదిరించిన జర్నలిస్టు ఎవరో తెలుసుకుంటామని అన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇదీ చూడండి: ఐపీఎల్ మెగావేలంపై సీఎస్కే ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!