క్రికెట్ దైవంగా అభిమానులు ఆరాధించే భారతరత్న సచిన్ తెందూల్కర్‌పై కేరళలో ఓ ప్రొఫెసర్ తన సొంత నిధులతో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. సచిన్‌పై వివిధ భాషల్లో ప్రచురితమైన 60 పుస్తకాలను సేకరించారు. కేరళ రాష్ట్రం కోజికడ్లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీలో హిస్టరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వశిష్ఠ్ ఈ మినీ గ్రంథాలయాన్ని రూపొందించారు.
ఎన్ని భాషల్లో అంటే..
ఇప్పటి వరకు సేకరించిన పుస్తకాలతో మలబార్ క్రిస్టియన్ కాలేజీ గ్రంథాలయంలోనే ప్రత్యేక గ్యాలరీగా ఏర్పాటు చేశారు వశిష్ఠ్. సచిన్ వ్యక్తిగత, క్రీడా, సామాజిక కార్యక్రమాలపై తెలుగు, మళయాలం, తమిళం, కన్నడ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, మరాఠి, గుజరాతీ, హిందీ, ఆంగ్లం భాషల్లో ప్రచురితమైన పుస్తకాలు ఇందులో పొందుపరిచారు.
జాతీయ సమైక్యత కోసం..
కళాశాల విద్యార్థులతో పాటు కోజికడ్ స్థానికులను సచిన్ లైబ్రరీ ఆకట్టుకుంటోంది. 'జాతీయ సమైక్యత కోసం క్రికెట్' అనే సందేశాన్ని సచిన్ లైబ్రరీ ద్వారా ప్రచారం చేయాలన్నదే తన ఉద్దేశ్యమని ప్రొఫెసర్ వశిష్ఠ్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ సచిన్‌పై ప్రచురితమైన పుస్తకాలను సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఆటలను ప్రేమిస్తేనే సరిపోదు.. ఆడాలి'