ఐపీఎల్ 2021 సీజన్ కంటే.. 2022 టోర్నీలో దారుణంగా విఫలమవుతోంది ముంబయి ఇండియన్స్. ముఖ్యంగా ఈ సీజన్ అయితే ఏమాత్రం కలిసి రావట్లేదు ఆ టీమ్‌కు. ఐపీఎల్ చరిత్రలోనే ఐదుసార్లు విజేతగా నిలిచిన రోహిత్ సేనకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత ధీన స్థితిని ఎదుర్కొంటుంది.
ఇది చాలదన్నట్లుగా ఆ జట్టును మరో సమస్య భయపెడుతుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే 2 మ్యాచ్‌ల్లో ఫైన్లతో గట్టెక్కిన ఆ జట్టు సారధి రోహిత్.. మరో మ్యాచ్‌లో అదే రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే, జట్టుగా సారథి రోహిత్ శర్మపై ఒక మ్యాచ్ నిషేధం తప్పనిసరి అవుతుంది.
కాగా, నిర్ణీత సమయంలో 20ఓవర్ల కోటాను పూర్తి చేయలేని కారణంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు రూ.24 లక్షలు జరిమానా విధించారు. అతనితో పాటు జట్టు సభ్యులందరికీ తలో రూ.6 లక్షల ఫైన్ వేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఒకవేళ ఇదే సీన్ మూడోసారి రిపీటైతే ఐపీఎల్ సవరించిన రూల్స్ ప్రకారం రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది.