Rishab pant vs Southafrica: "అంతర్జాతీయ క్రికెట్ నుంచి పంత్‌కు విరామం ఇవ్వాలి".. "అది పంత్ సహజ శైలి ఆటతీరని పనికిరాని మాటలు మాట్లాడొద్దు".. ఇవీ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి అనంతరం పంత్ వైఫల్యంపై వినిపిస్తున్న విమర్శలు. జట్టును ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో.. పేలవ షాట్లు ఆడి వికెట్ పారేసుకున్న అతని ఆటతీరుపై మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని వారసుడిగా జట్టులో అడుగుపెట్టి.. కొన్ని కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు అద్భుత విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పంత్ ప్రస్తుత ఆటతీరు మారాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిరుడు ఆరంభంలో ఆస్ట్రేలియాలో పంత్ వీరోచిత పోరాటం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించడంలో ప్రధాన పాత్ర పోషించిన అతను.. చివరిదైన గబ్బా మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 89 పరుగులతో జట్టుకు చారిత్రక విజయాన్ని కట్టబెట్టాడు. ఆ సిరీస్‌తో పంత్ విలువ ఎంతో పెరిగింది. ఇక జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అతని స్థానానికి ఢోకా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల అతని ప్రదర్శన పడిపోతుంది. క్రీజులో నిలబడి ఆడేందుకు అతనికి ఓపిక ఉండడం లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను నిలకడగా విఫలమవుతున్నాడు.
అదే చేటు..
Pant performance: పంత్‌ది మొదటి నుంచి దూకుడైన ఆటతీరే. అతని సహజ శైలి అదే. భారీ షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించాలనుకుంటాడు. కానీ అన్నిసార్లు అది ఫలితాన్ని ఇవ్వదనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. ఓ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడాడని అనుకునేలోపే.. మరో ఇన్నింగ్స్‌లో తన వైఫల్యాన్ని బయటపెడుతున్నాడు. గబ్బాలో రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి 50 బంతుల వరకూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. డిఫెన్స్ మెరుగ్గా ఆడాడు. పరిస్థితులకు అలవాటు పడ్డాక తన దూకుడుతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కానీ ఇప్పుడా ఆటతీరు కనిపించడం లేదు. ఎంతసేపు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరడం తప్ప.. క్రీజులో నిలబడి పిచ్ పరిస్థితులపై అవగాహన తెచ్చుకుందామనే ధ్యాసే కనిపించడం లేదు.
అది కావాలి..
Pant vs Southafrica: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఔటైన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అప్పటికే అర్ధశతకాలు చేసిన రహానె, పుజారా స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆ దశలో క్రీజులో నిలబడాల్సింది పోయి భారీషాట్‌కు ప్రయత్నించి పంత్ పెవిలియన్ చేరాడు. జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టి వెనుదిరిగాడు. ఒకవేళ పంత్ కొంత సమయం క్రీజులో గడిపి పరుగులు చేసి ఉంటే.. ఆ మ్యాచ్‌లో ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్ అలా ఔటవడం వల్ల ఇప్పుడు అతని స్థానంలో మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగే సాహాను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. స్వదేశంలో కివీస్‌తో సిరీస్‌లో సాహా ఆకట్టుకున్నాడు. పంత్ ఒంటిచేత్తో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాక్కోగలడు. కానీ అతను ఇంకా తన బ్యాటింగ్‌ను ఎంతో మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నియంత్రణతో కూడిన దూకుడు కావాలి. తన కెరీర్ ఆరంభంతో పోలిస్తే వికెట్ కీపింగ్‌లో ఎంతో మెరుగైన పంత్.. బ్యాటింగ్‌లోనూ పరిణతి సాధించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎంత వేగంగా జట్టులో ఎదిగాడో.. అంతే వేగంగా కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది.
"క్రీజులో ఇద్దరు కొత్త బ్యాటర్లు ఉన్నపుడు పంత్ అలాంటి షాట్ ఆడతాడని ఎవరైనా ఊహిస్తారా? ఆ షాట్ ఆడినందుకు ఎలాంటి సాకులు చెప్పకూడదు. అదే అతని సహజ శైలి అని పనికిరాని మాటలు మాట్లాడకూడదు. అతను కొంచెమైనా బాధ్యతగా ఉండాలి’’
- సునీల్ గావస్కర్
"పంత్‌కు విరామం ఇవ్వాలి. మంచి బ్యాటర్, ఉత్తమ వికెట్ కీపరైన సాహా జట్టుకు అందుబాటులో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో ఎలా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడో పంత్ నిర్ణయించుకోవాలి. ఒకవేళ అతని బుర్రలో ఏమైనా సందేహాలుంటే అతనికి విరామం ఇవ్వడం మంచిది. అతనో మ్యాచ్ విన్నర్. కానీ ఇలా బ్యాటింగ్ చేయకూడదు. జట్టు కోసం బ్యాటింగ్ చేయాలి కానీ తన కోసం కాదు"
- మదన్ లాల్
ఇదీ చూడండి: 'పంత్‌కు కొన్ని రోజులు విశ్రాంతి ఇస్తే మంచిది'