ఐపీఎల్.. ప్రతిభ కలిగిన క్రికెటర్లు తమను తాము నిరూపించుకునేందుకు చక్కని వేదిక. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఎంతో మంది కుర్రాళ్లను భారత క్రికెట్‌కు అందించింది. వారంతా చక్కగా రాణిస్తున్నారు కూడా. టీమ్ ఇండియాలో పాండ్య బ్రదర్స్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా.. ఇలా ఎందరో ఐపీఎల్లో చెలరేగి జాతీయ జట్టులోకి వచ్చిన వాళ్లే.
కాసుల వర్షం కురిపించే ఈ లీగ్‌లో ఆడాలని.. విదేశీ ఆటగాళ్లూ ఊవిళ్లూరుతుంటారు. ఎక్కడైనా ఎవరైనా బాగా ఆడితే.. వారు తమ జట్టులో ఉండాలని కోరుకొనే ఫ్రాంఛైజీలకు కొదువే ఉండదు. ఇటీవలి కాలంలో.. బాగా రాణించిన శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగపైనా ఇప్పుడు ఫ్రాంఛైజీల దృష్టి పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇతడిని తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా సహా వ్యక్తిగత కారణాలతో భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్-14కు(తొలి అర్ధభాగం) చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఆర్సీబీ నుంచి కూడా ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా.. ఆదిలోనే తప్పుకున్నాడు. ఇతని స్థానంలోనే ఇప్పుడు హసరంగను తీసుకోవాలని ఆర్సీబీ అనుకుంటున్నట్లు తెలిసింది. ఒకవేళ.. హసరంగ బెంగళూరు జట్టులో చేరితే స్పిన్ విభాగం బలంగా తయారవుతుంది. టాప్ స్పిన్నర్లైన యుజ్వేంద్ర చాహల్, హసరంగను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమే. హసరంగ.. బ్యాట్‌తోనూ చివర్లో వేగంగా పరుగులు చేయగలడు.
ఐపీఎల్-14 తొలి అర్ధభాగంలో ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఇండియా సిరీస్‌తో వెలుగులోకి..
24 ఏళ్ల ఈ లంక స్పిన్నర్.. ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్‌లో రాణించాడు. టీ-20 సిరీస్‌లో 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చివరి మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి.. 9 పరుగులకే 4 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే రోజు అతని పుట్టినరోజు కావడం మరో విశేషం.
ఇటీవల ప్రకటించిన టీ-20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో హసరంగ.. తన కెరీర్లో అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచాడు.
ప్రస్తుతం ఐపీఎల్లో ఒక్క లంక ప్లేయర్‌ను కూడా ప్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.
సెప్టెంబర్ 19 నుంచి షురూ..
ఐపీఎల్ 2021.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న తిరిగి ప్రారంభం కానుంది. రెండో దశలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2.. అక్టోబర్ 10, 13 తేదీల్లో జరగనుండగా.. ఎలిమినేటర్ అక్టోబర్ 11న నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ అక్టోబర్ 15న జరగనుంది.
యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్‌కు విదేశీ క్రికెటర్లు అందరూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్‌కు ముందే కరిబీయన్ ప్రీమియర్ లీగ్ ముగించేలా వెస్టిండీస్ క్రికెట్‌తో చర్చలు జరిపింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు కరిబీయన్ ప్రీమియర్ లీగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు అక్కడి నిర్వాహకులు.
ఇదీ చూడండి: IPL 2021: సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్.. పూర్తి షెడ్యూల్ ఇదే