Ravichandran Ashwin Dhoni: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ధోని కెప్టెన్సీ ఎంత ముఖ్యమో, అతడిలోని ఫినిషింగ్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యమని టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరుగనున్న ఈ మెగాటోర్నీ మెగా వేలం గురించి ప్రస్తావిస్తూ అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే మహిలా బ్యాటింగ్ చేయగలరని పేర్కొన్నాడు.
"20 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధోని బ్యాటింగ్‌కు దిగితే సమీకరణాలు మారిపోతాయి. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ఔటై చెన్నై జట్టు ఓడిపోయిందనుకుందాం. అప్పుడు అందరూ ఓటమి గురించే మాట్లాడుతారు. కానీ, ధోని ఆడిన కీలక ఇన్నింగ్స్ గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటి ఘటనలు నేను చాలా చూశా. అందుకే, చాలా మంది చెన్నై జట్టు సాధించిన విజయాల గురించి, ధోని కెప్టెన్సీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, అతడిలోని ఫినిషర్‌కు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనిపిస్తోంది. అలాగే, చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు మ్యాచును ముగించి జట్టును విజేతగా నిలిపిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలాంటి ఘటనలు యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి" అని అశ్విన్ అన్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ధోనికి పేరుంది. తన నాయకత్వ పటిమతో చెన్నై జట్టును నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. ఇప్పటి వరకు 193 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధోని 130 స్ట్రైక్ రేటుతో 4,746 పరుగులు చేశాడు. కాగా, 2015 వరకు అశ్విన్ చెన్నై జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. గత సీజన్‌లో అశ్విన్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు.
ఇదీ చూడండి: ఈ స్విమ్మర్ అందమంతా ఆ నవ్వులోనే!