ఇంగ్లాండ్ గడ్డపై టీమ్‌ఇండియా అదరగొట్టేలా కోచ్ రవిశాస్త్రి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్యాట్స్‌మెన్ భారీ శతకాలు బాదేసేలా శిక్షణా పద్ధతుల్లో మూడు కొత్త మార్పులు చేస్తున్నారని తెలిసింది. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేస్తేనే బౌలర్లు ఒత్తిడి లేకుండా 20 వికెట్లు తీయగలరని ఆయన భావిస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ఫైనల్స్, ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, అజింక్య రహానె శతకాలు చేయడం అత్యంత కీలకం. ప్రతి మ్యాచులో కనీసం ఇద్దరు ఆటగాళ్లు మూడంకెల స్కోరును అందుకొంటే టీమ్‌ఇండియా సునాయాసంగా విజయం అందుకోగలదు. అందుకే బ్యాట్స్‌మన్ సెంచరీలు చేసేలా శాస్త్రి మూడు ప్రణాళికలు సిద్ధం చేశారట.
- నెట్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ పొడవును 22 నుంచి 16 గజాలకు తగ్గించడం మొదటిది. ఇలా చేస్తే వేగంగా వస్తున్న బంతులను ముందుగానే ఆడాల్సి ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎలాంటి షాట్ ఆడాలో వేగంగా నిర్ణయం తీసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- ఒకవైపు నునుపు తేలిన బంతులతో ముందుగానే సాధన చేయించడం రెండోది. ఇలా చేస్తే నునుపు బంతులు ఎలా పిచవుతున్నాయో ముందుగానే గుర్తించాడనికి వీలవుతుంది. ఇలాంటి బంతులు ఆడటం వల్ల పరిస్థితులపై అవగాహన కలుగుతుంది.
- బంతిని ఆడాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండకుండా వదిలేసేలా శిక్షణ ఇవ్వడం మూడోది. ఇంగ్లాండ్‌లో స్వింగ్ అయ్యే బంతులను వదిలేయడం చాలా అవసరం. ఈ కళ నేర్చుకొంటే తికమక పడకుండా స్థిరంగా బంతులు వదిలేయోచ్చు.
అన్ని దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో ఆడటం భిన్నంగా ఉంటుంది. అక్కడి వాతావరణం, పరిస్థితులకు ముందుగానే అలవాటు పడాలి. పిచ్‌లపై చక్కని పచ్చిక ఉంటుంది. బంతులు వేగంగా స్వింగ్ అవుతాయి. ఇంగ్లీష్ పేసర్లు కూడా సొంతగడ్డపై చెలరేగుతారు. ఎక్కువగా స్పిన్ పిచ్‌లపై ఆడే ఆసియా దేశాలు అక్కడ ఇబ్బంది పడతాయి. చివరి పర్యటనలో టీమ్‌ఇండియా గెలుపునకు అద్భుత అవకాశాలు వచ్చినా పరుగులు ఎక్కువ లేకపోవడం వల్ల ఓటమి పాలైంది.