శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ జట్టును ముందుండి నడిపిస్తాడని పేర్కొన్నాయి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ వెళ్లనుంది కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు. జూన్ 18-22 వరకు కివీస్‌తో డబ్ల్యూటీసీ మ్యాచ్ ఆడనుంది. తర్వాత ఆగస్ట్ 4 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో పాల్గొననుంది టీమ్ఇండియా. దీంతో జులైలో మ్యాచ్‌లేమీ లేకపోవడం వల్ల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ప్రకటించింది బీసీసీఐ.
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లాండ్ నుంచి శ్రీలంకకు.. మళ్లీ అక్కడి నుంచి ఇంగ్లాండ్‌కు భారత జట్టు ప్రయాణించడానికి వీలులేదు. దీంతో మరో టీమ్‌ను శ్రీలంకకు పంపాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. రవి శాస్త్రి, కోహ్లీ ఇంగ్లాండ్‌లో ఉంటే.. ద్రవిడ్, ధావన్ శ్రీలంకకు పంపించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'సుశీల్ ఘటనతో డబ్ల్యూఎఫ్ఐ ప్రతిష్ఠ దిగజారింది'