Prasidh Krishna Debut T20 : టీమ్ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇప్పటికే వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక పేసర్.. టీ20 డెబ్యూ మ్యాచ్‌లోనూ రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ప్రసిద్ధ్.. 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తాను వేసిన తొలి ఓవర్‌లో ఐర్లాండ్ బ్యాటర్ టెక్టర్‌ను ఔట్ చేసిన ప్రసిద్ధ్.. రెండో ఓవర్‌లో డాక్రెల్‌ను పెవిలియన్‌కు పంపాడు.
వెన్నుగాయంతో జట్టుకు దూరం..
Prasidh Krishna Injury : అయితే.. గత కొంత కాలంగా వెన్ను గాయంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా 2023 ఐపీఎల్ సీజన్ కూడా ఆడలేదు. అతడు ఐర్లాండ్‌తో ఆడిన తొలి టీ20కి ముందు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌నకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. కాగా 27 ఏళ్ల ప్రసిద్ధ్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున 14 వన్డేలు ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ.. 5.32 ఎకానమీతో 25 వికెట్లు తీశాడు. పదునైన బంతులను సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
మెగా టోర్నీల్లో చోటు!
Prasidh Krishna Latest News : వన్డేలు, టీ20ల్లో అదరగొడుతున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను టీమ్ఇండియా త్వరలో ఆడబోయే మెగా టోర్నీలకు ఎంపిక చేయాలని క్రికెట్ మాజీలు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా టీమ్ఇండియా మరో పేసర్ సిరాజ్.. ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. విండీస్ పర్యటనకు వెళ్లిన సిరాజ్ మధ్యలోనే అక్కడ నుంచి భారత్‌కు తిరిగి వచ్చేశాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సిరాజ్‌కు ప్రత్యామ్నాయంగా ప్రసిద్ధ్‌కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Ind vs Ire T20 : ఐర్లాండ్‌పై తొలి టీ20లో భారత్ విజయం.. రీఎంట్రీలో అదరగొట్టిన బుమ్రా